గుంటూరు, ఫిబ్రవరి 3,
ఏపీలో వైసీపీ గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం ఓ ఎత్తైతే మంగళగిరిలో ఆ పార్టీ గెలుపు అనూహ్యంగా నిలిచింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివసిస్తున్న నియోజక వర్గం నుంచి ఆయన తనయుడు లోకేష్ పోటీ చేశాడు. నాటి ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓటమి పాలయ్యాడు. ఆర్కే విజయం సాధించాడు. ఆర్కే గెలుపుకు చాలా కారణాలు దోహదం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనంలో లోకేష్‌ను ఓడించి ఆర్కే కూడా సునాయాసంగా విజయం సాధించాడు. అలాంటి నియోజక వర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎదురు గాలి వీస్తోంది.మంగళగిరి వైఎస్సార్సీపీలో ముసలం పుట్టినట్టుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై నియోజక వర్గ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా ఎమ్మెల్యే ఆర్కే సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఉండటం కూడా నేతల్ని నిరాశకు గురి చేస్తోంది. తామేం చెప్పినా పరిస్థితులు మారే పరిస్థితి లేదనే భావనతో చాలామంది నాయకులు సమీక్షకు డుమ్మా కొట్టేయడం చర్చనీయాంశంగా మారింది.వైకాపా మంగళగిరి నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం ఆదివారం మంగళగిరిలో నిర్వహించారు.అయితే సమీక్షకు పలువురు కీలక నాయకులు గైర్హాజరయ్యారు. వచ్చిన కొద్ది మంది నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎమ్మెల్యే పనితీరుపై అభిప్రాయాలను సేకరించే నాయకుల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు, ఎంపీ అయోధ్యరామిరెడ్డి ఉండటంతో శాసనసభ్యుడి పనితీరుపై తమ అభిప్రాయాలు, అసంతృప్తిని వ్యక్తం చేయలేకపోయామని నాయకులు, కార్యకర్తలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తపరిచారు.పార్టీ కీలక సమావేశంలో అయోధ్యరామిరెడ్డి నాలుగు గోడల మధ్యకు పిలిచి అభిప్రాయ సేకరణ చేయడంతో తమ ఇబ్బందులను, పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లలేక పోయామని కార్యకర్తలు చెబుతు్నారు. బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంటే తమ సమస్యలన్నింటినీ ఏకరవు పెట్టడానికి అవకాశం ఉండేదంటున్నారు. మూడున్నరేళ్లుగా తమను ఎవరూ పట్టించుకోలేదని, పార్టీలో కూడా తగిన గౌరవం లభించలేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమను ఎవరూ లెక్కచేయడం లేదని, నియోజక వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత దక్కడం లేదని మరికొందరు నేతలు ఆరోపించారు.సమన్వయ సమావేశానికి పార్టీకి చెందిన కీలక నాయకులు తాడేపల్లి మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి, మంగళగిరి మాజీ ఎంపీపీ మున్నంగి గోపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో మాజీ ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, తాజా మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు సమావేశానికి హాజరుకాలేదు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వచ్చి ప్రసంగించి సమావేశం మధ్యలోనే వేరే పని ఉందంటూ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్న నాయకులు సమీక్షకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆర్కే పనితీరుతో విసుగు చెందే చాలా మంది గైర్హాజరైనట్లు నాయకుల్లో ప్రచారం సాగుతోంది.