YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శివక్యైం చెందిన కళాతపస్వీ

శివక్యైం చెందిన కళాతపస్వీ

హైదరాబాద్, ఫిబ్రవరి 3, 
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్  ఇకలేరు. గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు.విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విశ్వనాథ్ కూడా అందులో ఉద్యోగానికి వెళ్లారు.సినిమాల్లో విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్ గా మొదలైంది. వాహిని స్టూడియోస్ లో ఆయన తొలి ఉద్యోగం అదే. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'పాతాళ భైరవి' చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.'ఆత్మ గౌరవం' సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దానికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'చెల్లెలి కాపురం', 'శారదా', 'ఓ సీత కథ', 'జీవన జ్యోతి' చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి. నందులు అందుకున్న సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో 'శంకరాభరణం' ఒకటి. దానికి ఉత్తమ సినిమాగా నంది మాత్రమే కాదు... జాతీయ అవార్డు కూడా వచ్చింది. 'బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్' విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది. 'సప్తపది', 'స్వాతిముత్యం', 'సూత్రధారులు', 'స్వరాభిషేకం' సినిమాలకూ నేషనల్ అవార్డులు వచ్చాయి. 'స్వాతి ముత్యం' సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు. చిత్రసీమకు విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఆయన్ను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలకూ ఆయన దర్శకత్వం వహించారు. 'శుభ సంకల్పం' సినిమాతో నటుడిగా మారిన ఆయన, ఆ తర్వాత పలు చిత్రాల్లో పాత్రలకు ప్రాణం పోశారు. విశ్వనాథ్ అనేది తెలుగు చిత్రసీమలో ఒక పేరు కాదు, చరిత్ర. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. ఎనిమిది సార్లు ఆయన ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. ఆయన్ను 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు.

ఆ కోరిక తీరకుండానే....
కె. విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన దర్శకుడు కాదు... ఉత్తరాది ప్రేక్షకులకూ ఆయన తెలుసు. మన కళాతపస్వి, కాశీనాథుని విశ్వనాథ్ తన సినిమాలతో హిందీ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. అక్కడ కూడా విజయాలు అందుకున్నారు. హిందీ చిత్రసీమకు వెళ్ళాలని విశ్వనాథ్ ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి, ఆయన బాలీవుడ్ ఎంట్రీ చాలా చిత్రంగా జరిగింది. కాంతారావు, చంద్ర మోహన్, రోజా రమణి ప్రధాన తరాలుగా విశ్వనాథ్ తీసిన 'ఓ సీత కథ' హిందీ నటుడు, నిర్మాత ప్రేమ్ జీకి నచ్చింది. రీమేక్ చేసి పెట్టమని పట్టుబట్టడంతో కాదనలేక ఓకే అన్నారు.
'ఓ సీత కథ'లో రోజా రమణి చేసిన పాత్రకు హిందీలో రేఖను తీసుకున్నారు. ప్రేమ్ జీ నిర్మాణం, ఆయన పద్ధతి కారణంగా ఆ సినిమా ఏళ్ళ తరబడి సెట్స్‌లో ఉంది. ఆ సమయంలో విశ్వనాథ్ తెలుగులో చాలా బిజీ. అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ శశిలాల్ నాయర్ చేతిలో దర్శకత్వ బాధ్యతలు అప్పగించి పూర్తి చేయమన్నారు. చివరకు, ఎప్పుడు విడుదలైందో తెలుసా? 1996లో! ఆ సినిమా పేరు 'ఔరత్... ఔరత్... ఔరత్'. ఆ సినిమా కంటే ముందు విశ్వనాథ్ హిందీకి దర్శకుడిగా వెళ్ళారు.
హిందీ 'సర్‌గమ్‌'...
సిసలైన ఎంట్రీ
తెలుగు ప్రేక్షకులకు 'సిరి సిరి మువ్వ' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాను హిందీలో 'సర్‌గమ్‌' పేరిట రీమేక్ చేశారు. అది విశ్వనాథ్ ఫస్ట్ హిందీ సినిమా. తెలుగులో నటించిన జయప్రద... హిందీలోనూ చేశారు. ఇక్కడ చంద్రమోహన్ నటించగా... హిందీలో ఆ పాత్రను రిషి కపూర్ చేశారు.'సిరి సిరి మువ్వ' హిందీ రీమేక్ రైట్స్ నిర్మాత ఎన్.ఎన్. సిప్పీ సొంతం చేసుకున్నారు. దీక్షిత్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. సినిమా చూసిన దీక్షిత్... మాతృక తీసిన అతను అయితేనే బావుంటుందని చెప్పడంతో విశ్వనాథ్ దగ్గరకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత హిందీలోనూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
'శంకరాభరణం' చిత్రాన్ని 'సుర్‌ సంగమ్‌'గా... 'సప్తపది'ని 'జాగ్‌ ఉఠా ఇన్సాన్‌'గా... 'శుభోదయం' సినిమాను 'కామ్‌చోర్‌'గా... 'జీవనజ్యోతి'ని 'సన్‌జోగ్‌'గా... 'శుభలేఖ' సినిమాను 'శుభ్‌ కామ్నా'గా... 'స్వాతిముత్యం' చిత్రాన్ని 'ఈశ్వర్‌'గా రీమేక్స్ చేశారు.
హిందీలో విశ్వనాథ్ పది సినిమాలు చేస్తే... అందులో ఎనిమిది తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలకు రీమేక్స్. హిందీ సినిమాలు రీమేక్ అయినప్పటికీ... ఆయన ఎక్కడా మక్కీకి మక్కీగా దించేయలేదు. కాపీ పేస్ట్, జిరాక్స్ టైపులో తీయలేదు. మాతృకలోని ఆత్మను చెడగొట్టకుండా జాగ్రత్త పడుతూ... మాతృకలో లోటుపాట్లు ఏమైనా అనిపిస్తే సవరిస్తూ... కథను వీలైనంత మెరుగ్గా చెప్పడానికి ప్రయత్నించారు. హిందీలో కె. విశ్వనాథ్ చేసిన స్ట్రెయిట్ సినిమాలు రెండు అంటే రెండు! వాటిలో ఒకటి... 'సంగీత్'. ఉత్తరాది నౌటంకీ నృత్యం నేపథ్యంలో రూపొందించారు. ఆ సినిమాలో మాధురీ దీక్షిత్ ప్రధాన తార. కళ్ళు లేని అమ్మాయిగా కనిపించారు. అజయ్‌ దేవ్‌గణ్‌, కరిష్మా కపూర్‌, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా 'ధన్‌వాన్‌' సినిమా చేశారు.
హిందీలో స్వయంకృషి...
విశ్వనాథ్ తీరని కోరిక
చిరంజీవి కథానాయకుడిగా విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం 'స్వయంకృషి'. దానిని హిందీలో రీమేక్ చేస్తే బావుంటుందని కళాతపస్వి ఆశపడ్డారు. అలాగే, 'అల్లుడు పట్టిన భరతం' చిత్రాన్నీ హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఆ కోరికలు తీరలేదు.

చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఎందరో దర్శకులతో పని చేశారు. కానీ తన తండ్రితో సమానంగా భావించేది మాత్రం కళా తపస్వి కె.విశ్వనాథ్‌నే. మెగాస్టార్ కెరీర్‌లో హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉండవచ్చు కానీ ఆయన మనసుకు దగ్గరైన సినిమాలు కొన్నే.  వాటిలో కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆపద్భాందవుడు, స్వయంకృషి సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. చిరంజీవిలోని స్టార్‌ని కాకుండా నటుడిని చూసిన కొద్ది మంది డైరెక్టర్లలో విశ్వనాథ్ కూడా ఒకరు.దీంతోపాటు వ్యక్తిగతంగా కూడా చిరంజీవి మీద కె.విశ్వనాథ్ ఎంతో ప్రేమ చూపించేవారు. స్వయంకృషి సినిమా షూటింగ్ సమయంలో భోజనం చేయకుండా పడుకుంటే కె.విశ్వనాథ్ స్వయంగా తన చేత్తో పెరుగన్నం కలిపి ఇచ్చారని చిరంజీవి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆయన్ను ఎప్పుడు కలిసినా చిరంజీవి కళ్లలో ఆ పితృవాత్సల్యం కనిపిస్తుంది.కె.విశ్వనాథ్‌తో తనకున్న అనుబంధాన్ని తెలిపే ఒక సంఘటనను చిరంజీవి ఒక అవార్డు ఫంక్షన్‌లో తెలిపారు. ఆ ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ ‘స్వయంకృషి సినిమా చేస్తున్నప్పుడు ఒక గుడిలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం లావుగా ఉన్నానన్న ఫీలింగ్ నాకుంది. కమల్ హాసన్‌కు ఆ ఫీలింగ్ రివర్స్‌లో ఉంది (నవ్వుతూ). ఆ లావు తగ్గించుకోవడం కోసం నేను మధ్యాహ్నం పూట భోజనం చేసేవాడిని కాదు.’‘కె.విశ్వనాథ్ గారు లంచ్ బ్రేక్ అనగానే నేను ఒక పక్కకి వెళ్లి పడుకున్నాను. అప్పుడు ఆయన చిరంజీవి రావడం లేదేంటి? తినడం లేదంటి? ఆకలితో ఉన్నవాడి చేత నేనెలా చేయించుకుంటాను అన్నారు. అప్పుడు పక్కనున్న వాళ్లు ఆయనకు అలవాటే అండీ అన్నా ఆయన వినలేదు. చిరంజీవిని నిద్ర లేపకండి అని ఆయన చేత్తో స్వయంగా పెరుగన్నం కలిపి ఇది స్వయంగా నేను కలిపానని చెప్పండి. దాంట్లో పెరుగన్నం కాదు నా ప్రేమని కలబోశానని చెప్పండి. ఎందుకు తినడో చూస్తాను అన్నారు. అది కంచి గుడి. ఆ తర్వాత నేను షాట్ రెడీ అని లేస్తుంటే వాళ్లు వచ్చి విశ్వనాథ్ గారు మీకు పెరుగన్నం పెట్టారు తినమని చెప్పారు. నేను తినను కదా అన్నాను. అప్పుడు ఆయన మాటలు చెప్పారు. అవి వినగానే నా తండ్రి నాకు కలిపిచ్చినట్లుగా అనిపించింది. ఆ గుళ్లో సాక్షాత్తూ శివుడు ఎందుకు పస్తులుంటావని ఈయన ద్వారా అనిపించినట్లు నాకు అనిపించింది. అది ఒక ప్రసాదం లాగా తిన్నాను తప్ప పెరుగన్నంలా తినలేదు. నేను ఎంతో మందితో పని చేశాను. కానీ నటీనటులను ఇంత ప్రేమగా చూసుకునే ఒకే ఒక దర్శకుడు నాకు తెలిసి విశ్వనాథ్ గారు. ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా రెండు బుగ్గలూ నిమురుతూ నన్ను ముద్దాడతారు ఆయన. అప్పుడు మా నాన్న గుర్తొస్తారు. ఇటువంటి దర్శకులు నిండు నూరేళ్లు బతకాలి. ఆయన ఆరోగ్యంతో ఉండాలి. ఆయన ఆశీస్సులు మా అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఆయనకు సన్మానం కాదు. ఆయన ప్రేమను తెలియజెప్పే అవకాశం ఇది. ఆయన ఇంతకంటే గొప్ప సన్మానాలు ఎన్నో చూశారు. ఈ అవార్డు ఆయనకి గొప్ప కాదు. ఆయనకు వచ్చినందుకు ఆ అవార్డే గర్వపడాలి. ఇది వారి అదృష్టం.’ అన్నారు.ఈ స్పీచ్ జరుగుతున్నంత సేపు చిరంజీవి నుంచుని కాకుండా కె.విశ్వనాథ్ పక్కన కూర్చునే మాట్లాడారు. కె.విశ్వనాథ్, చిరంజీవి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. అవే ఆపద్భాందవుడు, శుభలేఖ, స్వయంకృషి. చిరంజీవి ఉత్తమ నటుడిగా తన మొట్టమొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును శుభలేఖ సినిమాకు అందుకున్నారు. ఇక ఆపద్భాందవుడు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నంది, ఫిల్మ్‌ఫేర్ రెండు అవార్డులూ వచ్చాయి. స్వయంకృషి సినిమాకు కూడా చిరంజీవి ఉత్తమ నటనకు నంది అవార్డును పొందారు. అంతే కాకుండా ఇవి మూడు ఎవర్‌గ్రీన్ సినిమాలు కూడా. కె.విశ్వనాథ్ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు భారత చలనచిత్ర పరిశ్రమకు కూడా తీరని లోటు.  

ఆయన మృతి తీరని లోటు...
ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మరణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తీసకువచ్చాయన్నారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్‌ చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారి తీశాయన్నారు. విశ్వనాథ్‌ మహాభినిష్క్రమణం తెలుగు సినీరంగానికి గొప్ప లోటని సీఎం అన్నారు. ఆయన సేవలు ఎంతో ఉన్నతమైనవనే వైఎస్సార్‌ పేరుమీద రాష్ట్రప్రభుత్వం లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించిందన్నారు ముఖ్యమంత్రి. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రతి సినిమా ఒక కళాఖండమే: పోచారం
ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి, పద్మశ్రీ , కే విశ్వనాథ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి దేశం గర్వించదగ్గ దర్శకుడు కే. విశ్వనాథ్ అని అభిప్రాయపడ్డారు. విశ్వనాథ్ సినిమాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయ విలువలకు ప్రతిబింబం అన్నారు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక కళాఖండమంటూ అభివర్ణించారు. కే విశ్వనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన పేరు
తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతి బాధాకరమన్నారు తెలంగాణ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. తన సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విశ్వనాథ్‌ను కోల్పోవడం తెలుగు ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విశ్వనాథ్, తెలుగు సినిమాల గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికలపైకి చేర్చారని కొనియాడారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.
కళా తపస్వి విశ్వనాథ్ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం
సినీ దిగ్గజం, కళా తపస్వి, ప్రముఖ దర్శకుడు, పద్మశ్రీ విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత, సాహిత్యాలే ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవి అని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్  సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్లిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలుగువారి గొప్పతనాన్ని దశదిశలా చాటింది అన్నారు. ఆయన సినిమా రంగానికి చేసిన కృషికి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే , రఘుపతి వెంకయ్య, 10 ఫిల్మ్ ఫేర్, నంది వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయనను వరించాయి అన్నారు. ఆయన మరణం సినీ ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమకు, కళా రంగానికి తీరని లోటు అన్నారు. సినిమా ఉన్నంత కాలం ఆయన జనంతో ఉంటారని, ఆయన తీసిన సినిమాలు ఈ సమాజాన్ని ఎప్పటికీ చైతన్య పరుస్తునే ఉంటాయన్నారు. విశ్వనాథ్ శివైక్యం చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.
తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్ట
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ మరణం పట్ల  అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన  మహాభినిష్క్రమణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని అన్నారు.  భారతీయ, తెలుగు సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుత సినిమాలు చేశారని కొనియాడారు.  ఆయన చేసిన సినిమాలు తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తెచ్చాయని పేర్కొన్నారు. విశ్వనాధ్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
మరపురాని చిత్రాలు అందించారు: కవిత
భారతదేశ సినీ పరిశ్రమలో తెలుగువారి పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ విశ్వనాథ్ మరణం తీరని లోటు అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నో మరపురాని చిత్రాలను, అనేక సందేశాత్మక చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకులు విశ్వనాథ్. విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని  భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అర్థరాత్రి ఆయన మరణించారు విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు.

Related Posts