కాకినాడ, ఫిబ్రవరి 6,
కాపు ఉద్యమనేత హరిరామజోగయ్య, మంత్రి గుడివాడ అమర్నాథ్ కు లేఖల వార్ నడుస్తోంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా హరిరామజోగయ్య గుడివాడ అమర్నాథ్ కు లేఖ రాశారు. ఈ లేఖలో మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివి అంటూ లేఖలో రాశారు. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకు, అనవసరంగా పవన్ కల్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు, నీ మంచి కోరి చెబుతున్న అంటూ హరిరామజోగయ్య మంత్రి అమర్నాత్ కు హితవు పలికారు. హరిరామజోగయ్య లేఖకు మంత్రి అమర్నాథ్ కూడా అంతే స్థాయిలో సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు రాయాల్సిన లేఖ పొరపాటున తనకు రాశారేమో అంటూ మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాపుల భవిష్యత్‌ను నాశనం చేయొద్దని చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటున్న పవన్‌కు చెప్పాలన్నారు. అయినా మీరు మానసికంగా బాగుండాలంటూ హరిరామజోగయ్యపై అమర్నాథ్ సెటైర్లు వేశారు.
పవన్ టీడీపీ సీనియర్ కార్యకర్త
పవన్ కల్యాణ్ పై మంత్రి అమర్నాథ్ విమర్శలు చేస్తూ... పవన్ టీడీపీ లో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే అన్నారు. పవన్, చంద్రబాబులు లోకేశ్ ను చెరో భుజంపై మోయడానికి సిద్ధమయ్యారన్నారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్ధం అయ్యారని, వేపగుంట కాపు సామాజిక భవనం ప్రారంభోత్సవంలో పవన్ పై అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కాపు భవనాల్లో సౌకర్యాలపై నిరసనలు వ్యక్తం చేశారు. మంత్రి అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డికి బానిసగా మారారని ఎద్దేవా చేశారు జనసేన రాష్ట్ర నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్. గాలి ఊపులో మంత్రి అయిన అమర్నాథ్ కు విజ్ఞత, విచక్షణ లేవన్నారు. ప్రోటోకాల్ అంటే తెలియని వ్యక్తి మంత్రి అవ్వడం రాష్ట్ర ప్రజల దురదృష్టం అన్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొకతప్పదన్నారు. కాపు రిజర్వేషన్లపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఇటీవల దీక్షకు పూనుకున్నారు. కాపులకు రిజర్వేషన్ల కల్పనే ఆయన కీలక డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని ఆయన సీఎం జగన్‌ను కోరారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై తేల్చకపోతే ఆమరణ దీక్షకు దిగేందుకు సిద్ధమయ్యారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా, వాటిలో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ హయాంలో ప్రయత్నించారన్నారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడేళ్లలో సీఎం జగన్ కాపులకు అన్యాయం చేశారని ఆరోపించారు. హరిరామజోగయ్య దీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించారు. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన దీక్ష విరమించారు.