YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగు తమ్ముళ్లు మౌనం ఎందుకు..

తెలుగు తమ్ముళ్లు మౌనం ఎందుకు..

నెల్లూరు, ఫిబ్రవరి 7, 
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తానని అనుచరులకు చెప్పేశారు. ఆయన అలా అన్నారో లేదో అధికారపార్టీ వైసీపీ ఆయన అధికారాలను కత్తెరించి.. రూరల్‌ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో స్పందించంది నెల్లూరు జిల్లా టీడీపీ నేతలే. అలాగే కోటంరెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ పెద్దల నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఎమ్మెల్యే శిబిరంలోనూ ఆందోళన కనిపిస్తోందట. నెల్లూరు జిల్లా టీడీపీలో సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రతోపాటు నెల్లూరు రూరల్‌ టీడీపీ ఇంఛార్జ్‌ అబ్దుల్‌ అజీజ్‌లు కోటంరెడ్డి వ్యవహారాన్ని చర్చిస్తున్నారట. ఇక్కడో విచిత్రం ఉంది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఈ టీడీపీ నేతలంతా ఒంటికాలిపై లేచేవారు. ఇప్పుడు మాత్రం ఆ ఎమ్మెల్యేను ఆహ్వానిస్తున్నట్టుకానీ.. వ్యతిరేకిస్తున్నట్టు కానీ ఎలాంటి స్పందన వీళ్ల నుంచి లేదు. కాకపోతే కోటంరెడ్డి వస్తే టీడీపీకి కలిగే లాభనష్టాలను విశ్లేషిస్తున్నారట టీడీపీ నాయకులు.సాధారణంగా వైసీపీ నాయకులు వస్తానంటే ప్రతిపక్ష నేతలు స్వాగతించడం పరిపాటి. కానీ కోటంరెడ్డి విషయంలో అలాంటి రియాక్షన్‌ ఏదీ లేదు. పైగా నెల్లూరు రూరల్‌లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసేది తానేనని కోటంరెడ్డే ప్రకటించేసుకున్నారు. ఈ విషయంలో లోకల్‌ టీడీపీ కేడర్‌ వాదన మరోలా ఉంది. టికెట్‌ విషయంలో తమతో మాట్లాడకుండా టీడీపీ అధినేత నిర్ణయం తీసుకోబోరని వారు చెబుతున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యే విషయాన్ని తమతో ఇంతవరకు పార్టీ చీఫ్‌ మాట్లాడలేదని టీడీపీ సీనియర్లు అంతరంగిక సంభాషణల్లో కామెంట్స్‌ చేస్తున్నారట. వైసీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ నేతలపై దాడులు చేయించారని.. అలాంటి వ్యక్తికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో అర్ధం కావడం లేదనేది మరికొందరి వాదన. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ టీడీపీ అభ్యర్థిగా అబ్దుల్‌ అజీజ్‌ పోటీ చేశారు. ఆయనే ఇంఛార్జ్‌గా ఉండటంతో.. ఎమ్మెల్యే కోటంరెడ్డిని తీసుకునే పక్షంలో ముందుగా అజీజ్‌తో మాట్లాడతారు కదా అని కొందరి ప్రశ్న. అజీజ్‌కు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే టీడీపీ అధినేత ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారట.ఇదే సమయంలో మరో చర్చా జరుగుతోంది. తన అనుచరులకు భరోసా ఇచ్చేందుకే ఎమ్మెల్యే కోటంరెడ్డి తాను టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పి ఉండొచ్చంటున్నారు. అంతే తప్ప టీడీపీ అధినేత నుంచి ఆయనకు స్పష్టమైన హామీ రాలేదని వారి అభిప్రాయం. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. మాజీ మంత్రి సోమిరెడ్డి లాంటి వాళ్లు కూడా ఎమ్మెల్యే విషయంలో పెదవి విప్పకపోవడం తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తోంది. మనం మనం బరంపురం అని కలుపుకోవడానికి చూస్తున్నారో లేక కోటంరెడ్డి ఎపిసోడ్‌పై టీడీపీ అధిష్ఠానమే ప్రకటన చేస్తుందని సైలెంట్‌ అయ్యారో కానీ… రకరకాల ప్రచారాలైతే షికారు చేస్తున్నాయి. మరి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విషయంలో నెల్లూరు టీడీపీ నేతలు ఎప్పుడు మాట్లాడతారో.. ఎలా స్పందిస్తారో.. ఎందుకు మౌనంగా ఉన్నారో కాలమే చెప్పాలి.

Related Posts