YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాపం..ఆర్కే...

పాపం..ఆర్కే...

గుంటూరు, ఫిబ్రవరి 9, 
మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా నిరసన సెగలు తప్పడం లేదు. ఇటీవల  ఇప్పటం గ్రామానికి వెళ్తే కూల్చివేతలపై నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మంగళగిరి పట్టణంలో పర్యటించినా నిరసనలు తప్పలేదు.  ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో   మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు  ఎమ్మెల్యే ఆర్కే వచ్చారు. ఆయన వస్తున్న సమయంలో ఆ కాలనీలో కొంత మంది గుమికూడి ఉన్నారు. వారంతా తన కోసం ఎదురు చూస్తున్నారనుకున్న ఎమ్మెల్యే వారి ముందు కారు ఆపారు.కానీ వారంతా ఎమ్మెల్యే వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని తరలింపుపై సమాధానం చెప్పాలని తమతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేను వారు ప్రశ్నించారు.  రాజధాని ద్రోహి అంటూ నినాదాలు ఉండవల్లి క్వారీ నుంచీ మట్టి తరలింపుపై నిరసన వ్యక్తం చేశారు. వారు తమ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించి గట్టిగా ప్రశ్నించడంతో ఆయన వెంటనే వాహనం ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయారు.  సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోకుండా వెళ్లడంతో స్థానిక మహిళలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో నారా లోకేష్ పై విజయం సాధించారు. అయితే అందు కోసం ఆయన చాలా హామీలు ఇచ్చారు. నారా లోకేష్ పై గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తామని సీఎం  జగన్ కూడా మంగళగిరిలో హామీ ఇచ్చారు. అయితే ఆయనకు మంత్రి పదవ రాలేదు. అలాగే..  ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు అవసరమైన నిధులు కూడా పెద్దగా అందుబాటులోకి రాలేదు. రాజకీయ పరంగా మంగళగిరి సున్నితమైన స్థానం కావడం .. ఈ సారి కూడా తానే పోటీ చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో వైసీపీ హైకమాండ్.. ఈ సారి  ఆర్కేకు బదులుగా ఇతరులకు టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణం ఏమో కానీ.. ఆర్కే నియోజకవర్గంలో పర్యటించడం తగ్గించారు. సమస్యలు పరిష్కారం కాకపోవడం.. నియోజకవర్గంలో కూడా పెద్దగా అందుబాటులో ఉండకపోవడంతో..  ఆయన నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో సొంత పార్టీలో నేతల్ని ఏక తాటిపైకి ఉంచలేకపోతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా మరో వర్గం కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాలన్నింటితో మంగళగిరిలో ఎప్పుడు పర్యటించినా ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిరసనలు ఎక్కువగా తగులుగుతున్నాయి. ముఖ్యమంత్రి సీఎం జగన్ నివాసం.. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. అమరావతి గ్రామాలు కూడా ఎక్కువగా నియోజకవర్గంలో ఉంటాయి.ఎన్నికలకు ముందు రాజధాని అమరావతేనని.. మార్చే ప్రశ్నే లేదని చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతిస్తున్నారు. ఈ కారణంగా రాజధాని రైతులు, అమరావతిని రాజధానిగా కోరుకునేవారు కూడా ఆయన పర్యటనల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts