YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కమలం... వ్యూహాత్మక మౌనం

కమలం... వ్యూహాత్మక మౌనం

విజయవాడ, ఫిబ్రవరి 9, 
బీజేపీ వ్యూహం ఏమిటి?..జనసేన పార్టీతో మైత్రి వెనుక వ్యూహం ఏమిటి? మైత్రి విషయంలో కమలం పార్టీ జనసేనతో ఆడుతున్న దాగుడుమూతలు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి. ఈ రాజకీయ క్రీడతో ఏం సాధించాలని అనుకుంటోంది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో నలుగుతున్నచర్చ ఇదే. ఏపీలో రాజకీయ గందరగోళం అన్నది బీజేపీలోనే తప్ప ప్రజలలో కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జన సేనాని పవన్ కల్యాణ్ తన విధానమేమిటి? దారేమిటి? లక్ష్యం ఏమిటి? అన్న క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు కూడా ఆ  విషయం విస్పష్టంగా చెప్పేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనీయను అనడంతోనే పవన్ కల్యాణ్ తన మససులో మాటను విస్పష్టంగా  బయటపెట్టేశారు. ఇక్కడే బీజేపీ గందరగోళంలో పడింది. పవన్ పొత్తు ఎవరితో అన్నది తేలిపోవడంతో.. బీజేపీతో మైత్రికి బీటలు వారాయా అన్న అనుమానం ఆ పార్టీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే జనసేనను మిత్రపక్షంగా కాకుండా వైరి పక్షంగా అనుమానంతో చూస్తోంది. అయితే పూర్తిగా తెగతెంపులు చేసుకోకుండా.. జనసేనతోనే తమ పొత్తు అంటూ ప్రకటనలు గుప్పిస్తూ పవన్ ను కన్ఫ్యూజ్ చేయాలన్న వ్యూహాన్ని అనుసరిస్తోంది. కలిసి వస్తే జనసేనతోనే పొత్తు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ ఇటు ప్రజలను కూడా గందరగోళంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది.రోడ్ మ్యాప్ విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది బీజేపీ. అయితే బీజేపీలోని ఒక వర్గం వారు మాత్రం రాష్ట్ర నాయకత్వం వ్యాఖ్యలకు, వ్యూహాలకు పార్టీ హైకమాండ్ సమయం చూసి చెక్ పెడుతుందని అంటున్నారు. అయితే  ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర బీజేపీలోని రెండు వర్గాలతోనూ పార్టీ హైకమాండ్ డబుల్ గేమ్ ఆడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  జనసేనతో తెగతెంపులు అయ్యేలా, అందుకు జనసేనాని పవన్ కల్యాణే కారణం అనేలా బీజేపీ రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్న తీరుకు ఆపార్టీ అగ్రనేతల ఆశీస్సులున్నాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.బీజేపీ రాష్ట్ర క్యాడర్ కూడా ఇవే సందేహాలను వ్యక్తం చేస్తోంది. కలిసి వస్తేనే జనసేన.. లేకపోతే జనంతోనే మా పొత్తు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా జనసేనానిని రెచ్చగోట్టే వ్యూహంతో చేసినవేనని అంటున్నారు. అలాగే ఇటీవల భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో కూడా జనసేనతో పొత్తు ఉంటుందన్న స్పష్టత లేకపోవడం, భావసారూప్యత ఉన్న పార్టీతో పొత్తు అంటూ పేర్కొనడం కూడా బీజేపీ, జనసేనల మైత్రి ఉందా.. ఉంటుందా.. అన్న సందేహాలకు తావిచ్చింది.  ఒక వైపు మిత్ర పక్షం అంటూనే మరో వైపు  జనసేనను, ఆ పార్టీ  అధినేత పవన్  కల్యాణ్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటోందన్న ప్రశ్న తలెత్తుతోంది.  అదే సమయంలో బీజేపీ హై కమాండ్ మాత్రం జనసేనతో మైత్రి విషయంలో ఎలాంటి శషభిషలూ లేకుండా సానుకూల ప్రకటనలు చేస్తోంది.తెలంగాణలో బీఆర్ఎస్ ను ఎదుర్కొని విజయం సాధించాలంటే బీజేపీకి.. ఆ రాష్ట్రంలో కూడా అసంఖ్యాక అభిమాన బలం ఉన్న జనసేనాని అండ అవసరం. ఇప్పటికే జనసేనాని తెలంగాణలో జనసేన పోటీ ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు. అలాగే తెలంగాణలో ఖమ్మం సభ తరువాత తెలుగుదేశం కూడా చురుకుగా మారింది. ముందుముందు మరిన్ని సభలతో ఎన్నికల నాటికి బలీయ శక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి   ఈ రెండు పార్టీల అండా లేకుండా తెలంగాణలో అధికారంలోకి రావడం అంత తేలిక కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అందుకే ఏపీలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో పొత్తు, మైత్రి పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అధిష్ఠానం మాత్రం మౌనన్నే ఆశ్రయిస్తోందంటున్నారు. పరిస్థితులను బట్టి తెలంగాణలో బీజేపీ అవసరాలను బట్టి ఏపీలో బీజేపీ పొత్తల విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే రాష్ట్ర నాయకుల ప్రకటనలతో సంబంధం లేకుండా  జీవీఎల్ వంటి బీజేపీ నేతలు జనసేనతో మాత్రమే తమ పార్టీ పొత్తు ఉంటుందని స్పష్టం చేస్తున్నారని అంటున్నారు.  

Related Posts