విజయవాడ, ఫిబ్రవరి 13,
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్‌సీపీ నేతలకు పదవుల పండుగ వచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఖాళీ అవుతున్న 8 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశాలు ఉన్నాయి. మరో ఐదు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు సంబంధించి ఇప్పటికే బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలతోపాటు స్థానిక సంస్థల కోటాలో 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అధికార వైసీపీ స్థానిక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించింది. సామాజికవర్గాల వారీగా పార్టీకి విధేయతగా పనిచేసిన వారికి మొదటి ప్రాథాన్యతను ఇవ్వాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2017లో స్థానిక సంస్థలకు సంబంధించి 8 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం మార్చి 29 తేదీతో వారి పదవీ కాలం ముగియనుంది. దీంతో నెల్లూరు జిల్లాకు సంబంధించి వాకాటి నారాయణ రెడ్డి , అనంతపురం నుండి గుణపాటి దీపక్ రెడ్డి , కడప నుండి బీటెక్ రవి పై మూడు స్థానాలకు సంబంధించి మార్చి 29వ తేదీతో పదవీ కాలం ముగియనుంది. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎం వెంకట సత్యనారాయణ, తూర్పు గోదావరి నుండి చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం నుండి శత్రుచర్ల విజయరామ రాజు, చిత్తూరు నుండి బీఎస్ నరసింహులు (దొరబాబు), కర్నూలు నుండి కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి చెందిన పై ఐదు మంది ఎమ్మెల్సీల పదవీకాలం మే 1తో ముగియనుంది. అయితే, పై 8 స్థానాలకు మార్చి 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని చోట్లా వైఎస్ఆర్‌సీపీకి పూర్తి స్థాయిలో బలం ఉంది. అధికార వైసీపీ ఎమ్మెల్సీ టిక్కెట్లు ఆశించేవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ నుండి తప్పుకుని అభ్యర్ధుల గెలుపుకోసం కృషిచేసిన పలువురు సీనియర్ నేతలుసైతం ఎమ్మెల్సీ టిక్కెట్లు ఆశిస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో హామీ ఇచ్చిన నేతల పేర్లతోపాటు తాజాగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మరికొంత మంది నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. 8 జిల్లాల్లో సామాజికవర్గాల వారీగా అభ్యర్ధులను ఖరారుచేసే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం నుండి ఎమ్మెల్సీ టిక్కెట్ ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఆసామాజికవర్గానికి చెందిన పార్టీ విధేయులకు అవకాశం కల్పించి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యత కల్పించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి 13 జిల్లాల్లో దాదాపుగా 90 శాతం పైగా వైసీపీ మద్దతు దారులే స్థానిక సంస్థల్లో విజయం సాధించారు. పంచాయతీలతోపాటు మండల పరిషత్‌లు జిల్లా పరిషత్‌లు అధికార వైసీపీనే సొంతం చేసుకుంది. మార్చి 13న జరగనున్న స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నుండి టిక్కెట్లు ఆశించేవారి సంఖ్య రోజురోజుకూ మరింత పెరుగుతోంది. అయితే ఈ సారి ఎమ్మెల్యే రేసులో ఉన్న వారికి టిక్కెట్లు ఇవ్వలేని వారు ఉంటే వారికి ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇవ్వాలన్న ఆలోచన సీఎం జగన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు.