విశాఖపట్టణం, ఫిబ్రవరి 13,
క్షిణ బంగాళాఖాతంలో, శ్రీలంకకు దిగువన బలమైన మేఘాలు, తేమ గాలులు కేంద్రీక్రుతం అయ్యాయి. వీటివల్ల తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రత్యేక ప్రభావం పడబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి వస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు..ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.‘రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంది. ఇక మెల్లగా చలి కాలం నుంచి ఎండా కాలానికి మారనుంది. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు, కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా, మరింత జోరుగా మొదలవ్వనుంది. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరగనుంది. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక సారిగా వేడికానుంది. ఇప్పుడే 40 డిగ్రీలు రావు కానీ 37 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదవ్వనుంది. ముఖ్యంగా విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంధ్యాల జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉండనుంది. మరోవైపున చలి కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.