హైదరాబాద్, ఫిబ్రవరి 13,
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఇప్పుడు తన దృష్టిని టాలీవుడ్‌పై ఫోకస్ చేశారు. సినిమా నిర్మాతగా ఆమె కొత్త అవతారం ఎత్తబొతున్నారు. ఇందు కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో మంత్రి విడదల రజిని కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సినిమాలపై ఆసక్తితోనే ఆమె ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు ఫిల్మ్ నగర్ తో పాటు, వైసీపీలో కూడా చెప్పుకుంటున్నారు. రజనీ నిర్మాలగా తొలి సినిమాకు కథ కూడా సిద్ధమైందని అంటున్నారు. చిత్ర దర్శకుడు, హీరో ఇత్యాది విషయాలపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని చెబుతున్నారు. సినిమా భారీ బడ్జెట్ తోనే విడదల రజని నిర్మించబోయే సినిమా తెరకెక్కబోతోందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కోసం.. యూఎస్ నుంచి ఎన్నారైల బృందం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. వారిలో విడదల రజినీ కూడా ఒకరు. అలా ఆ ఎన్నికల్లో రజని తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. 2017లో విశాఖపట్నంలో నిర్వహించిన మహానాడు వేదికపై నుంచి తెలుగుదేశం అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత 2018లో వైసీపీలో చేరి... 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. జగన్ మలి కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడదల రజినీ బాద్యతలు చేపట్టారు. అయితే తొలిసారి ఇలా ఎమ్మెల్యే అయి.. అలా మంత్రి పదవి చేపట్టి విడదల రజినీ.. వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె.. అడుగులు పాలిటిక్స్ నుంచి సినిమా రంగం వైపు పడుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. జగన్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు టాలీవుడ్‌లోని నటీనటులు, దర్శక, నిర్మాతలతో స్నేహ సంబంధాలు, బంధుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు నర్సిపట్నం ఎమ్మెల్యే పి. ఉమా శంకర్ గణేశ్, మరో దర్శకుడు కురసాల కళ్యాణ కృష్ణ సోదరుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఇక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పలు చిత్రాల్లో నటించారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ సైతం.. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా.. నటిస్తున్నారు కూడా. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా.. సినీమారంగం నుంచే రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాజమండ్రి ఎంపీ మారగాని భరత్ కూడా సినిమాలో నటించారు. అలాగే ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ సమీప బంధువు కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ప్రముఖ నటుడు అలీ, పోసాని కృష్ణమురళీ ఉండనే ఉన్నారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మంత్రి విడదల రజినీ చేరారు.