విజయవాడ, ఫిబ్రవరి 15,
విజయవాడలోని ప్రసిద్ధ తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రం పేరును మార్చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఈ మేరకు మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ బోర్డు తయారీలో ఉంది. త్వరలో దాన్ని ఆ భవనంపై ఏర్పాటుచేస్తాం. అంతేగానీ, పేరు మార్చలేదని విజయవాడ నగర పాలక సంస్థ తెలిపినట్లుగా స్పష్టం చేసింది. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం భవనాన్ని పునరుద్ధరించారు. ఎలివేషన్ భాగాన్ని పునరుద్ధరించే క్రమంలో ‘‘తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం’’ బోర్డు తొలగించారు. పనులు పూర్తయ్యాక ఆ బోర్డును యథాస్థానంలో పెట్టలేదని తెలిపారు. 2021 డిసెంబరులో కూడా ఈ భవనానికి కొన్ని మరమ్మతులు చేపట్టాం. ఈ భవనం కేవలం సాంస్కృతిక కార్యక్రమాల కోసమే నిర్దేశించింది అనే ఉద్దేశాన్ని హైలైట్ చేయడానికి ‘‘కళాక్షేత్రం’’ అనే పేరు ఎలివేషన్ భాగంపైన గ్లో సైన్ బోర్డు పెట్టాం. అంతేగానీ, పేరు మార్చే ఉద్దేశమేదీ లేదని నగర పాలక సంస్థ స్పష్టం చేసింది.తుమ్మలపల్లి హరినారాయణ అనే దాత ఇచ్చిన ఆర్థిక సాయంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌హాల్ నిర్మించింది. ఆ టౌన్‌హాలుకు మహాకవి క్షేత్రయ్య పేరుతోపాటు దాత పేరు కలిసివచ్చేలా ‘తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం’ అని పేరు పెట్టారు. దీనిని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మర్రి చెన్నారెడ్డి 1980లో ప్రారంభించారు. నాటి నుంచి ఇది తుమ్మలపల్లి కళాక్షేత్రంగా వాడుకలోకి వచ్చింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఫేస్ లిఫ్ట్ ప్రోగ్రాం పేరుతో తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ఆధునికీకరించారు. సీటింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ హాలును సెంట్రలైజ్డ్ ఏసీ హాలుగా మార్చారు. కళాక్షేత్రం ఆవరణలో ఫౌంటైన్లు ఏర్పాటు చేసి మరిన్ని మెరుగులు దిద్దారు. అయితే 2021 డిసెంబర్‌లోనూ అభివృద్ధి పనులు చేపట్టారు.. ఆ సమయంలో బోర్డు తీసేసి కళాక్షేత్రం అని మాత్రమే ఉంచారు.దీంతో వివాదం ప్రారంభమయింది. అయితే బోర్డు తయారీకి ఏళ్లు పడుతుందా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. పేరు మార్చాలన్న ఉద్దేశంతోనే కళాక్షేత్రం అని పేరు పెట్టారని.. ఆ బోర్డులు కూడా డిజైనర్ బోర్డులు పెట్టారని.. తాత్కలికంగా ఏర్పాటు చేసినవి కాదంటున్నారు. ఇప్పుడు వివాదాస్పదం కావడంతోనే ఇలాంటి వివరణ ఇచ్చారని.. బోర్డును ఎక్కడా తయారు చేయించడం లేదని అంటున్నారు. ఎంత త్వరగా బోర్డును ఏర్పాటు చేస్తే అంత త్వరగా వివాదం సమసిపోయే అవకాశం ఉంది.