విశాఖపట్టణం, ఫిబ్రవరి 15,
విశాఖలో తూర్పు నియోజకవర్గం రాజకీయాలు చాలా ప్రత్యేకం. 2009 తర్వాత టీడీపీ గట్టి పట్టు సాధించింది. వెలగపూడి రామకృష్ణబాబు వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వెలగపూడిని ఓడించేందుకు ఒకసారి ప్రజారాజ్యం, రెండుసార్లు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు అధికారపార్టీ వైనాట్ 175 అంటోంది. టీడీపీ గెలిచిన స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఆ జాబితాలో ఉన్నదే తూర్పు నియోజకవర్గం. కాపు, యాదవ, మత్స్యకార, బ్రాహ్మణ సామాజికవర్గాలు ఇక్కడ బలమైనవి. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్యే దూకుడికి బ్రేకులు వేయాలని భావించింది వైసీపీ. 2019లో పోటీ చేసి ఓడిన అక్కరమాని విజయనిర్మలను నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొనసాగిస్తూనే.. కీలకమైన VMRDA చైర్మన్‌ను చేసింది. తొలిసారి కార్పొరేటర్‌గా గెలిచిన గోలగాని హరి వెంకట కుమారికి మేయర్ పీఠం కట్టబెట్టింది. సీనియర్ నాయకుడు వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఓకే సామాజికవర్గానికి పదవులు ఇవ్వడంపై పార్టీలోని ఇతర వర్గాలు అసంతృప్తితో ఉన్నా హైకమాండ్ మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించింది.నేతలకు పదవులు కట్టబెట్టినా తూర్పులో వైసీపీకి ఆశించినస్థాయిలో ఊపు రాలేదనే చర్చ ఉంది. దీనికి కారణం వర్గ రాజకీయాలే. మేయర్ కుమారి, అక్కరమాని మధ్య నెలకొన్న ప్రచ్చన్న యుద్ధం డైరెక్ట్ ఫైట్‌గా మారింది. ఆధిపత్యం కోసం అక్కరమాని నేరుగా సీఎంకి ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో గతంలో తూర్పు ఇంఛార్జ్‌గా పనిచేసిన MLC వంశీకృష్ణ సైతం టికెట్ ఆశిస్తున్నారు. అక్కరమాని రాజకీయాలను అంగీకరీంచేది లేదని ప్రకటించి.. ఆమె నిర్వహించే కార్యక్రమాలకు వంశీ వర్గం దూరమైంది. ఈ సమస్యలు పరిష్కరించేందుకు పలుమార్లు హైకమాండ్ సమన్వయ కమిటీ సమావేశాలు పెట్టినా గ్రూపు రాజకీయాల రచ్చ చల్లారలేదు.ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే పార్టీకి జరిగే నష్టాన్ని గుర్తించి ఈస్ట్‌లో కొత్త యాక్షన్ ప్లాన్ షురూ చేసింది అధిష్ఠానం. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఎంచుకుంది. ఈసారి ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి వెలగపూడిపై గెలిస్తే.. పార్టీ పవర్‌లోకి వస్తే ప్రమోషన్ ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు MVV. తూర్పులో ఉన్న నాయకులు, కేడర్ కు దగ్గరయ్యే చర్యలు ప్రారంభించారు ఎంపీ. కుమారుడు వివాహ రిసెప్షన్‌లో తూర్పు కేడర్, లీడర్లకు ప్రయారిటీ లభించిందట. ఒకటి రెండు నెలల్లో ఎంవీవీని కోఆర్డినేటర్‌గా ప్రకటిస్తారని అనుకుంటున్నారు. గడప గడపకు బాధ్యతలను అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.అధిష్ఠానం మూడ్ తెలుసుకున్నాక తూర్పు వైసీపీలోని మూడు గ్రూపులు అలెర్ట్ అయ్యాయి. ఎడముఖం పెడముఖంగా ఉన్న అక్కరమాని, వంశీకృష్ణ, మేయర్ వర్గాలు ఒక తాటి మీదకు వచ్చేయనే చర్చ సాగుతోంది. సీఎం పాల్గొన్న కార్యక్రమంలో మూడు గ్రూపులు ఐక్యంగా ఉన్నామని కలరింగ్ ఇచ్చాయి. సీటు కోసం కోట్లాడుకుంటే జరిగే నష్టం గుర్తించి ఇటీవల సామాజికవర్గంలో పెద్ద చర్చ జరిగినట్టు తెలిసింది. తమలో సీటు ఎవరికి ఇచ్చిన కలిసి పనిచేయాలని..ఇప్పుడు అవకాశం కోల్పోతే మళ్లీ రాదనే అభిప్రాయం వ్యక్తమైందట. అలాగని అధినాయకత్వం నిర్ణయాన్ని ధిక్కరించే ధైర్యం వాళ్లకు లేదు. ఈ పరిస్థితుల్లో తమకున్న అవకాశాలను దెబ్బతీయవద్దనే విజ్ఞప్తిని హైకమాండ్ దగ్గరకు తీసుకుని వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారట. ఐతే, అభ్యర్థిత్వం మార్పు దాదాపు ఖరారైన తరుణంలో మూడు గ్రూపుల ట్రయిల్స్ ఎంత వరకు వర్కవుట్ అవుతాయో సందేహమే.