న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15,
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. గత ఏడాది ఓ యువతి శ్రద్ధా వాకర్ ను బాయ్ ఫ్రెండ్ హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్ లో దాచడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా అలాంటి ఘటన నైరుతి ఢిల్లీలోని మిత్రాన్ గ్రామ శివార్లలో జరిగింది. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న ఓ యువతిని సహజీవనం చేసిన యువకుడే దారుణంగా హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచడం కలకలం రేపింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి.అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సాహిల్ గెహ్లాట్, హర్యానా లోని ఝజ్జర్ కు చెందిన నిక్కీ యాదవ్ కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. అయితే ఈ ఫిబ్రవరి 10న సాహిల్ వివాహం జరిగింది. కానీ తన పెళ్లికి ప్రియురాలు అడ్డుగా భావించి నిందితుడు తనతో సహజీవనం చేసిన యువతిని హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ఐఎస్‌బీటీ వద్ద నిక్కీ యాదవ్ ను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం నిక్కీ యాదవ్ డెడ్ బాడీని తన కారులో నజఫ్ గఢ్ లోని మిత్రాన్ గ్రామానికి తీసుకొచ్చాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి తన దాబాలోని రిఫ్రిజిరేటర్ లో ఉంచాడని పోలీసులు తెలిపారు.ఫిబ్రవరి 10వ తేదీన ప్రియురాలు నిక్కీ యాదవ్ ను హత్య చేసిన రోజే మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సాహిల్. పోలీసులు నిందితుడు నడుపుతున్న దాబాకు వెళ్లి తనిఖీ చేయగా ఫ్రిజ్ నుంచి దుర్వాసన రావడంతో తెరిచి చూడగా ఓ డెడ్ బాడీని ముక్కలు చేసి దాచి ఉంచిటన్లు పోలీసులు గుర్తించారు. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న నిక్కీ యాదవ్ తనను మోసం చేశావంటూ ప్రియుడ్ని నిలదీసింది. వేరే అమ్మాయితో పెళ్లిని అడ్డుకుంటానని ఆమె చెప్పడంతో ఆవేశానికి లోనై తానే నిక్కీ యాదవ్ ను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో నిందితుడు సాహిల్ అంగీకరించాడని వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది. తన పెళ్లిని అడ్డుకుంటుందన్న కారణంతోనే ప్రియురాలిని హత్య చేశానని నిందితుడు అంగీకరించాడని అడిషనల్ డీసీపీ విక్రమ్ సింగ్ వెల్లడించారు. నిందితుడు సాహిల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం నడుచుకుంటామని చెప్పారు.శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచాడు. తనకు వీలు దొరికినప్పుడల్లా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ముక్కలు పారవేశాడు. శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు 6,636 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేశారు. కేసు నమోదైన 75 రోజుల్లో చార్జిషీట్‌ను సమర్పించారు. గతేడాది నవంబర్ 12న ఢిల్లీ పోలీసులు నిందితుడు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు.