న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15,
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.పదోతరగతి పరీక్షలు మార్చి 21 వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 5 వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షలను మార్చి 27నే నిర్వహించనున్నారు. కేవలం ఒకరోజు జరిగే పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. 12వ తరగతి మిగతా పరీక్షలు, పదోతరగతి పరీక్షల షెడ్యూల్ డిసెంబరు 29న ప్రకటించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
➥ ఈసారి సీబీఎస్ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 38,83,710 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 10వ తరగతి పరీక్షలకు 21,86,940 మంది అభ్యర్థులు, 12వ తరగతి పరీక్షలకు 16,96,770 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
➥ పదోతరగతి పరీక్షలకు 9 లక్షల 39 వేల 566 మంది బాలికలు హాజరుకానుండగా.. 12 లక్షల 47 వేల 364 మంది బాలురు హాజరవుతున్నారు. ఇతరులు 10 మంది ఉన్నారు.
➥12వ తరగతి పరీక్షలకు 7 లక్షల 45 వేల 433 మంది బాలికలు, 9 లక్షల 51 వేల 332 మంది బాలురు హాజరుకానున్నారు. ఇతరులు ఐదుగురు ఉన్నారు.
➥ పదోతరగతి పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 24,491 పాఠశాలల పరిధిలో 7240 పరీక్ష కేంద్రాలను, 12వ తరగతి పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 16,738 పాఠశాలల పరిధిలో 6759 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇప్పటికే విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత పాఠశాలల నుంచి పొందవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేటు విద్యార్థుల అడ్మిట్ కార్డులను కూడా సీబీఎస్‌ఈ విడుదల చేసింది.
హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
* హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- cbse.gov.in.
* అక్కడ హోంపేజీలో కనిపించే 'Main website' టాబ్ మీద క్లిక్ చేయాలి.
* క్లిక్ చేయగానే వచ్చే పేజీలో సీబీఎస్‌ఈ క్లాస్-10, 12 పరీక్షల హాల్‌టికెట్లకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
* విద్యార్థులు తమ వివరాలు నమోదుచేయగానే పరీక్ష హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
* హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని పరీక్షల సమయంలో వెంటతీసుకెళ్లాలి.