YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యూనివర్సిటీలో మత్తు మాఫియా కలకలం...

యూనివర్సిటీలో మత్తు మాఫియా కలకలం...

విశాఖపట్నం
ఆంధ్ర యూనివర్సిటీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంపస్ లో గంజాయి అమ్మకం కలకలం సృష్టిస్తుంది. ఇటీవల గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురు నిందితుల్లో యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డు ఉండడం పై ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్ రోడ్ లోని యోగా విలేజ్,మహిళా ఇంజీనీరింగ్ కాలేజ్ దగ్గర గంజాయి విక్రయిస్తూ సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది.వేలాది మంది విద్యార్థులు చదువుకునే చోట గంజాయి ఆనవాళ్లు బయటపడడం విస్మయానికి గురి చేస్తోంది. యూనివర్సిటీ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను నిలువరించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది గంజాయితో పట్టుబడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 
విశాఖలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతుందని అనడానికి ఏయూ ఘటన నిదర్శనం. గతంలో పోలిస్తే ఇటీవల గంజాయి అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. జిల్లా సరిహద్దులను దాటిస్తున్న వారిలో యువతే ఎక్కువగా పట్టుబడుతున్నారు. చాలా చోట్ల గంజాయి సేవిస్తున్న వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఇటీవల పోలీసులు మత్తు ఇంజక్షన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.ఏయూలో మత్తు పదార్థాల విక్రయాలు సాగిస్తున్నాయనే విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఒకసారి యూనివర్సిటీలోని విద్యార్థులు, బయటి కాలేజీ విద్యార్థులు గంజాయి వ్యవహారంలోనే పెద్ద ఎత్తున గొడవపడి పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారు. ఆ తరువాత ఇలాంటి ఘటనలు వెలుగులోకి రానప్పటికీ, యూనివర్సిటీలో గుట్టుగా గంజాయి సరఫరా జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యా వనంలో గంజాయి దందా సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏయూలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చంద్రమౌళి తో పాటు ఆటో డ్రైవర్ సురేష్, సతీష్ ఏయూ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తుల్లో తేలింది. వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలమాంబ గుడి నుంచి యూనివర్సిటీ వరకు గతంలో దుకాణాలు ఉండేవి. వీటిలో గుట్టుగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నాయన్న సమాచారంతో అధికారులు వాటిని తొలగించారు. ఇప్పుడు ఏకంగా సెక్యూరిటీ సిబ్బంది గుట్టుగా గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. యూనివర్సిటీ కేంద్రంగా ఇలాంటి వ్యవహారం సాగుతోందనే విషయం వెలుగులోకి రావడంతో అధికారుల్లో అలజడి మొదలైంది.

Related Posts