కాకినాడ ఫిబ్రవరి 17
తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు అనపర్తి సభ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు చంద్రబాబు అనపర్తి పర్యటనకు కలెక్టర్ ఎస్పీ నిన్ననే అనుమతి ఇచ్చారు. అయితే సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఈరోజు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే... చంద్రబాబు పర్యటనలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత పర్యటనను అడ్డుకునేందుకు ఎక్కడా లేని ఆంక్షలు విధిస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దఎత్తున ప్రజలు చంద్రబాబు పర్యటనలో పాల్గొంటున్నారు. చంద్రబాబుకు ఎక్కడిక్కడ హారతులు పడుతున్నారు. తమ సమస్యలను టీడీపీ అధినేతకు చెప్పుకొంటున్నారు. రెండు రోజులుగా విజయవంతంగా పర్యటిస్తున్న చంద్రబాబు ఈరోజు సామర్లకోట నుంచి బయలుదేరి అనపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో రాజమహేంద్రవరం పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.