నెల్లూరు, ఫిబ్రవరి 17,
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వానికి కౌంటర్లు ఇచ్చిన ఆయన, ఇప్పుడు నిరసన ప్రదర్శనలతో ప్రజల ముందుకొచ్చారు. ముందుగా ముస్లింల నిరసన గొంతుక పేరుతో కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు రూరల్ పరిధిలో ముస్లింల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిధుల కొరతతో ఆగిపోయాయని, వాటికి తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన.నిధుల కోసం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అందుకే ఇప్పుడు ప్రశ్నిస్తున్నానని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏళ్లతరబడి కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయని, వైసీపీ హయాంలో అయినా అవి పూర్తవుతాయనుకుంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు కోటంరెడ్డి.నెల్లూరులో ప్రతి ఏడాదీ రొట్టెల పండగ నిర్వహించుకునే స్వర్ణాల చెరువు పక్కన ఉన్న బారాషహీద్ దర్గా అభివృద్ధికి రూ.13 కోట్లకు గతంలో సీఎం జగన్ ఆమోదం తెలిపారని, కానీ ఆర్థికశాఖ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. ముస్లిం గురుకుల పాఠశాల భవన నిర్మాణం తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొదలైందాని, దాన్ని వైసీపీ హయాంలో కూడా తాను పూర్తి చేయలేకపోయానన్నారు. ఎప్పుడు నిధులు అడిగినా లేవనే సమాధానం వస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు కోటంరెడ్డి.మంజల్ నిర్మాణం కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఈ సమస్యల మీద గట్టిగా మాట్లాడుతున్నానని తనను పార్టీలో అవమానించారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆవేదనకు గురిచేశారన్నారు. నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదని, అందుకే ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించారు కోటంరెడ్డి.ప్రభుత్వం చేసిన పనిని మరో ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు కోటంరెడ్డి. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. టిడ్కో ఇళ్లను గత ప్రభుత్వం మొదలు పెట్టినా, ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా వాటిని ఆలస్యం చేసిందని, పూర్తయిన ఇళ్లను కూడా మౌలిక సదుపాయాలు సాకుగా చూపించి లబ్ధిదారులకు ఇవ్వడం లేదని చెప్పారు.నెల్లూరు రూరల్ పరిధిలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందా సరే, లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామంటూ ఇదివరకే హెచ్చరించారు ఎమ్మల్యే కోటంరెడ్డి. అన్నమాట ప్రకారం ఆయన ఇప్పుడు పోరాటానికి సిద్ధమయ్యారు. ముస్లింల నిరసన గొంతుక వినిపించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ముస్లింల జనాభా ఎక్కువ. రూరల్ లో ముస్లిం ఓటర్లు జయాపజయాలను ప్రభావితం చేస్తుంటారు. ఇప్పటి వరకూ ముస్లింలు వైసీపీకే మద్దతుగా ఉంటూ వచ్చారు. గతంలో నెల్లూరు రూరల్ లో టీడీపీ మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపినా ముస్లింల ఓట్లు వైసీపీకే పడ్డాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీని వీడి బయటకు వచ్చారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ముస్లింలు ఆయనకే మద్దతిస్తారని అనుచరులు చెబుతున్నారు. అయితే అధికార వైసీపీ మాత్రం ముస్లిం నాయకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రంలో ముస్లింల సమస్యలకోసం గళమెత్తిన కోటంరెడ్డి వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.