గుంటూరు ఫిబ్రవరి 17
వచ్చే ఎన్నికలలో టీడీపీ - జనసేన ఏకమవుతాయని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా విషయం తెలిసిందన్నారు. కన్నాతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని.. కన్నాను రాజశేఖర్ రెడ్డి జనార్దన్ రెడ్డి సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చారు. పెదకూరపాడులో కన్నా తాను కలిసి పోటీచేసామని గుర్తుచేశారు. చేబ్రోలు హనుమయ్య కన్నాను ప్రోత్సాహించారని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తే వారికి సపోర్ట్ చేస్తానని... కన్నా టీడీపీలో చేరితే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నాతో కలిసి పని చేస్తామన్నారు. ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది, తనకు ఉండేది తనకు ఉంటుందని చెప్పారు. గత ఎన్నికలలో పత్తిపాటి, జి,వి.ఆంజనేయులు, యరపతినేని లాంటి వారికి ఆర్థిక సాయం చేశామని... ఇప్పుడు వాళ్లు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నరసరావుపేట సీటు చదలవాడ అరవింద్ బాబు దే అని... ఈ సారి అరవింద్ బాబు తప్పకుండా నరసరావుపేట ఎమ్మెల్యే అవుతారని రాయపాటి సాంబశివరావు జోస్యం చెప్పారు.కాగా... నిన్న బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనుచరులతో కలిసి బీజేపీకి కన్నా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు కన్నా వెల్లడించారు. అయితే కన్నా టీడీపీలో కానీ, జనసేన పార్టీలోకి కానీ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. కన్నా ఏ పార్టీలోకి వెళతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.