నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు, వారు తమకు సమాచారం లేదన్నారు. చివరకు ఆయన పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నారు. డీఎస్పీతో మాట్లాడి ఆయన వద్ద క్లారిటీ తీసుకున్నాకగానీ వెనుతిరగలేదు కోటంరెడ్డి.అనుకున్నంతా అయింది, నెల్లూరులో రివేంజ్ పాలిటిక్స్ మొదలయ్యాయ. 4 నెలల క్రితం జరిగిన ఓ ఘటనలో ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడు తాటి వెంకటేశ్వర్లుని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అక్కడే డీఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. కావాలనే తన అనుచరులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. 24 గంటల్లో తాటి వెంకటేశ్వర్లుని కోర్టులో హాజరుపరచకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. తనతోపాటు వచ్చేవారంతా అన్నిటికీ తెగించే వస్తున్నారని, అరెస్ట్ లకు ఎవరూ భయపడబోరన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.నెల్లూరు రూరల్ పరిధిలో కోటంరెడ్డి అనుచరులు అరెస్ట్ అయిన ఘటన ఇది రెండోది. ఇటీవల సయ్యద్ సమి అనే మైనార్టీ నేతను హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ సమి కోటంరెడ్డి అనుచరుడే అయినా ఆయన అరెస్ట్ అయిన కేసు మాత్రం వేరే. బారాషహీద్ దర్గాలో మరో మైనార్టీ నేతల, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడిపై సమీ కత్తితో దాడికి పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాటి వెంకటేశ్వర్లుని అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది.తాటి వెంకటేశ్వర్లు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ప్రధాన అనుచరుడు. గత ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ ఆయనకు దక్కకపోయినా ఆయన ఎమ్మెల్యేని వదిలిపెట్టలేదు. వైసీపీ నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన, కోటంరెడ్డితోపాటే బయటకు వచ్చేశారు. సౌమ్యుడిగా పేరున్న తాటి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర స్వామి మాలధారణలో ఉన్నారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడంతో రూరల్ లో కలకలం రేగింది.మిగతా అనుచరులను భయపెట్టడానికే ఇలా అరెస్ట్ లు చేస్తున్నారంటూ మండిపడ్డారు కోటంరెడ్డి. అరెస్ట్ లతో ఎవరినీ బెదిరించలేరని, భయపెట్టలేరని ఆయన మండిపడ్డారు. అరెస్ట్ లు చేసుకున్నా, బెదిరింపులకు పాల్పడ్డా, అనుచరులంతా తనతోపాటే ఉంటారని, వారికి రక్షణగా తాను ఉంటానని చెప్పారు.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వదిలి బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా చాలామంది ఆయన వెంట బయటకు వచ్చారు. అయితే రూరల్ విషయంలో సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కోటంరెడ్డితోపాటు పార్టీ కేడర్ బయటకు వెళ్లకూడదని ఆయన స్థానిక నేతలకు ఆదేశాలిచ్చారు. ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడంతోపాటు, ఆయనకే ఇన్ చార్జ్ పోస్ట్ ఇచ్చారు. అక్కడ ఆదాల తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అకాశమిచ్చారు. ఆదాల ఆధ్వర్యంలో రూరల్ సమస్యలన్నీ పరిష్కరించేందుకు కూడా సీఎం జగన్ హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఆదాల నియోజకవర్గంలో కలియదిరిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్పొరేటర్లందర్నీ తనవైపు తిప్పుకోబోతున్నారు. రూరల్ సమస్యలపై సమీక్షలు నిర్వహించారు. త్వరలో గడప గడపకు ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ఈలోగా ఈ అరెస్ట్ లతో కలకలం రేగింది.