YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రంపచోడవరంలో టీడీపీ దారెటు

రంపచోడవరంలో  టీడీపీ దారెటు

ఏలూరు, ఫిబ్రవరి 20, 
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం ST రిజర్వ్డ్‌ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్‌ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. ఆమె ఒంటెద్దు పోకడలకు పోతున్నారనేది కేడర్‌ ఆరోపణ. మూడున్నరేళ్లుగా శ్రేణులు చెల్లాచెదురవుతున్నా పట్టించుకోవడం లేదట. వంతలతో పడని మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్‌లు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు రంపచోడవరం టీడీపీకి కంచుకోట. టీడీపీ పోటీలో లేకపోతే సైకిల్‌ పార్టీ మద్దతుతో ఇక్కడ వామపక్షాలు బరిలో ఉండేవి. 2004 నుంచి సీన్‌ మారింది. 2004, 2009లో ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. తర్వాత వైసీపీకి పట్టం కట్టారు రంపచోడవరం ఓటర్లు.2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజేశ్వరి తర్వాత కండువా మార్చేశారు. 2019 ఎన్నికల్లో సీనియర్లను కాదని రాజేశ్వరికే టికెట్‌ ఇచ్చింది టీడీపీ అధిష్ఠానం. దాంతో మాజీ ఎమ్మెల్యేలు అలిగినట్టు చెబుతారు. దీనికితోడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే టీడీపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని రాజేశ్వరిపై ఆరోపణలు ఉన్నాయి. అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల ఊసే లేదట. ఏదైనా చేస్తే మొక్కుబడిగా ఉంటోందనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల కోసం కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారుమరోసారి పోటీకి రాజేశ్వరి ఆసక్తితో ఉండగా.. టీడీపీ నేత గొర్లె సునీత సైతం కర్చీఫ్‌ వేస్తున్నారట. మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ.. మాజీ మంత్రులతో టికెట్‌ కోసం మంతనాలు జరుపుతున్నారట. టిడిపి టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది క్వశ్చన్‌ మార్క్ కావడంతో నేతలు సైలెంట్‌ అయ్యారు. ఒకరంటే ఒకరికి గిట్టక కార్యకర్తలు సైతం గ్రూపులుగా విడిపోయారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నేతలే కాకుండా.. శీతంశెట్టి వెంకటేశ్వర్లు, చిన్నం బాబు రమేష్ కూడా టీడీపీ ఛాన్స్‌ ఇస్తే పోటీకి సై అంటున్నారట. అయితే అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇస్తే వారే పార్టీ జెండా మోస్తారని.. మిగిలిన వాళ్లు దూరంగా ఉంటారని ప్రచారం మొదలైంది. గడిచిన 4 ఎన్నికల్లో ఓడినా.. ఇక్కడి నేతలు గుణపాఠం నేర్చుకోలేదన్న కామెంట్సూ వినిపిస్తున్నాయి. మరి.. రంపచోడవరం టీడీపీకి పార్టీ పెద్దలు చికిత్స చేస్తారో లేక నాన్చుతారో చూడాలి.

Related Posts