విశాఖపట్టణం, ఫిబ్రవరి 23,
గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గెలిస్తే.. నర్సీపట్నంలో ఓడిపోయారు అయ్యన్న పాత్రుడు. ఎమ్మెల్యేగా గెలిచిన గంటా రాజకీయ పరిస్థితుల వల్ల మూడున్నరేళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. అసలు టీడీపీలో ఉంటారో లేదో అన్నట్టుగా అనేక ప్రచారాలు జరిగాయి. ఇదే సమయంలో అయ్యన్నపాత్రుడు మాత్రం టీడీపీ స్వరం గట్టిగానే వినిపించారు. అవకాశం వస్తే అధికారపార్టీపై ఒంటికాలిపై లేచి రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఇంకా ఎదుర్కొంటున్నారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో టీడీపీలో మళ్లీ గట్టిగా సౌండ్ చేస్తున్నారు గంటా. పనిలో పనిగా పార్టీలో తనకు శత్రువుగా ఉన్న అయ్యన్న విషయంలోనూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే టీడీపీలో లేటెస్ట్ హాట్ టాపిక్.ఆ మధ్య గంటా టీడీపీకి అనుకూలంగా కామెంట్స్ చేయడంతో.. గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అయ్యన్న. ఎన్టీఆర్ వర్థంతి రోజున టీడీపీ యువనేతను ఆకాశానికెత్తేయడమే కాదు.. తాను టీడీపీలోనే ఉండిపోతానని చెప్పేశారు గంటా. ఎన్నికలైనప్పటి నుంచీ టీడీపీకి దూరంగా ఉన్న గంటా.. ఎన్నికల టైమ్‌లో మళ్లీ లైమ్ లైట్లోకి రావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు అయ్యన్న. ఎవడండీ గంటా? లక్షల్లో వాడొక్కడు..! లక్షల్లో నేనొక్కడిని…!! గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? లేక ప్రధానా..? అని అయ్యన్న ప్రశ్నల వర్షం కురిపించారు కూడా. “పార్టీలో అందరూ రావాలి, పని చేయాలి.. అంతేకాని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొరియల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ బయటకు రావడం సరికాదు” అని గంటాకు చురకలు వేశారు అయ్యన్నపాత్రుడు.ఈ మాటలు గట్టిగా గుచ్చుకున్నాయో ఏమో.. గంటా వర్గం కొత్త ఎత్తుగడ వేసినట్టు టాక్. అయ్యన్నను టీడీపీ పెద్దలు కట్టడి చేశారని ప్రచారం చేస్తున్నారట. గంటా విషయంలో ఏం మాట్లాడొద్దు.. అందువల్ల పార్టీ కూడా డ్యామేజీ అవుతోందని అధిష్ఠానం అయ్యన్నకు చెప్పిందని.. ఇకపై నోరు విప్పొద్దు అని కట్టడి చేసిందనేది గంటా వర్గం వాదన. అయ్యన్నపాత్రుడి తీరు చూసిన వాళ్లు మాత్రం గంటా వర్గం ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. దూకుడు స్వభావం కలిగిన అయ్యన్నను కట్టడి చేసే సాహసం అధిష్ఠానం చేస్తుందా? అది సాధ్యమయ్యే పనేనా? పార్టీ చెప్పిందని అయ్యన్న కామ్‌గా ఉండగలరా? అని ప్రశ్నిస్తున్నారట. మూడేళ్లుగా ఈ ప్రాంతంలో టీడీపీ కోసం పనిచేసింది.. కేసులతో ఇబ్బంది పడింది ఎవరో అధిష్ఠానానికి తెలియదా అని నిలదీస్తున్నారట. టీడీపీలో మళ్లీ ప్రాధాన్యం దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగానే గంటా వర్గం ఈ పాచిక విసిరిందనేవాళ్లూ ఉన్నారు. గంటా శిబిరం నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా సర్రున రియాక్ట్ అయ్యే అయ్యన్న పాత్రుడు.. తాజా ప్రచారంపై ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ అంశంపై అయ్యన్న స్పందిస్తే మాత్రం ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మళ్లీ మంట రేగినట్టే. మొత్తానికి అయ్యన్న మెడలో గంట కట్టే ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.