YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అందుబాటులోకి కేన్‌ హార్వెస్టర్‌

అందుబాటులోకి  కేన్‌ హార్వెస్టర్‌

ఏలూరు, ఫిబ్రవరి 23, 
చెరకు రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కూలీల కొరతను అధిగమించేందుకు అత్యాధునిక యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యంత్రాల్లోని సాంకేతిక లోపాలను అధిగమించేలా దీన్ని రూపొందించారు. ఈ యంత్రం కూలీల కొరతవల్ల రైతులు పడుతున్న వెతలకు చెక్‌ పెట్టడమే కాదు.. కోత వ్యయాన్ని సగానికిపైగా తగ్గిస్తుంది.దేశంలో ప్రధానమైన వాణిజ్యపంటల్లో చెరకు ఒకటి. దేశవ్యాప్తంగా 48.51 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. మన రాష్ట్రంలో 55 వేల హెక్టార్లలో చెరకు సాగుచేస్తున్నారు. ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో పాటు కూలీల కొరత, కొత్తగా పుట్టుకొస్తున్న చీడపీడలు (పసుపు ఆకు, వైరస్‌ తెగుళ్లు) రైతులను వేధిస్తున్నాయి. సాగుకాలంలో కనీసం 40 రోజులు కూలీల అవసరం తప్పనిసరి. కూలీలు లేనిదే కోత కొయ్యలేని పరిస్థితి నెలకొంది.  గిరాకీని బట్టి టన్ను చెరకు నరకడానికి రూ.800 నుంచి రూ.1,200 వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా ఎకరాకు రూ.24 వేలకు పైగా కూలీల కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తం సాగువ్యయంలో 35 శాతంగా నమోదవుతున్న కూలీల ఖర్చు రైతులకు భారంగా మారుతోంది. అయినప్పటికీ సమయానికి కూలీలు దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఎన్నో రకాల చెరకు కోత యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటిలోని సాంకేతిక లోపాలు చక్కెర రికవరీకి అవరోధంగా ఉంటున్నాయి. దీంతో కోత సమయంలో ఎక్కువమంది రైతులు కూలీలపైనే ఆధార పడుతున్నారు. మేలైన కోత యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ వ్యవసాయ ఇంజనీరింగ్‌ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది.కోల్హాపూర్‌లో వాడుకలో ఉన్న జైపూర్‌ వారి సూపర్‌ కేన్‌ హార్వెస్టర్‌ను అధ్యయనం చేశారు. కాస్త మార్పులు చేసి మన ప్రాంతానికి, మన రైతులకు అనుకూలంగా తీర్చిదిద్దారు.  ఈ సూపర్‌ కేన్‌ హార్వెస్టర్‌ చెరకును నేలమట్టానికి నరికి చక్కెర కర్మాగారానికి తరలించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా చక్కెర రికవరీకి ఏమాత్రం ఢోకా ఉండదు. ఈ హార్వెస్టర్‌ కింద, పై భాగాల్లో రెండు కట్టర్‌ బ్లేడులతో పాటు ఒక డిట్రాషింగ్‌ యూనిట్‌ ఉంటాయి. కట్టర్‌ బ్లేడులను చెరకు పొడవును బట్టి హైడ్రాలిక్‌ పవర్‌ సహాయంతో కావాల్సిన ఎత్తుకు సర్దుబాటు చేసుకోవచ్చు.కింద భాగంలో ఉండే కట్టరు బ్లేడు చెరకును నేలమట్టానికి నరికితే పైభాగంలో ఉండే కట్టరు బ్లేడ్‌ చెరకు మొవ్వను కోస్తుంది. తర్వాత చెరకు గడలు బెల్ట్‌ సాయంతో డిట్రాషింగ్‌ యూనిట్‌లోకి వెళతాయి. ఈ యూనిట్‌లో చెరకు గడలకు ఉన్న ఎండుటాకులను తెంచి పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత యంత్రం వెనుక భాగంలో ఉండే ట్రాలీలోకి పంపుతుంది. ఈ ట్రాలీ నుంచి సూపర్‌ గ్రబ్బర్‌ అనే యంత్రం ట్రాక్టర్‌లోకి లోడ్‌ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిగా యంత్రమే చేస్తుంది.  ఈ యంత్రం ధర మార్కెట్‌లో రూ.33 లక్షలుగా ఉంది. 75 హెచ్‌పీ ట్రాక్టర్‌ రూ.13 లక్షలు, సూపర్‌ గ్రబ్బర్‌ రూ.4 లక్షలు కలిపి మొత్తం రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ యంత్రం గంటకు 3–4 టన్నుల చొప్పున రోజుకు 25 టన్నుల చెరకును సునాయాసంగా నరికేస్తుంది. ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు.ఈ యంత్రం సాయంతో చెరకు నరికేందుకు టన్నుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. సరాసరి చెరకు దిగుబడి ఎకరాకు 30 టన్నులుగా తీసుకుంటే కూలీలతో నరికితే టన్నుకు రూ.800 చొప్పున రూ.24 వేలు ఖర్చవుతుంది. అదే ఈ యంత్రంతో నరికితే టన్నుకు రూ.400 చొప్పున 30 టన్నులకు రూ.12 వేలకు మించి ఖర్చవదు. అంటే కూలీలతో నరికించే దానికంటే ఖర్చును 50 శాతం వరకు తగ్గిస్తుంది.  

Related Posts