అనంతపురం, ఫిబ్రవరి 24,
ధర్మవరం - గుత్తి డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఏపీలో డబ్లింగ్ తో పాటు విద్యుదీకరణను పూర్తి చేసుకున్న మరో కీలకమైన ప్రాజెక్ట్ ఇది. చిగిచెర్ల నుంచి ధర్మవరం మధ్య విభాగాన్ని డబ్లింగ్ మరియు విద్యుదీకరణతో సహా పూర్తి చేసి విజయవంతంగా ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే. ఫలితంగా గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర డబుల్ రైల్వే లైన్ కనెక్టివిటీతో విద్యుద్దీకరించబడింది.గుత్తి - ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్ట్ ఏపీలో ఒక ప్రాముఖ్యమైన రైలు లింక్. ఇది దక్షిణ భారత రాష్ట్రాలకు ఒక ప్రవేశ ద్వారంగా కుడా పనిచేస్తుంది. ఈ లైన్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, కర్ణాటక రాజధాని నగరం మరియు వెలుపల కలిపే ముఖ్యమైన మార్గాల్లో ఒకటిగా పనిచేస్తుంది. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ జెడ్ సర్వీస్ (రైట్స్) ద్వారా 90 కిలోమీటర్ల మేర గుత్తి -ధర్మవరం ప్రాజెక్టు డబ్లింగ్ మరియు విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మంజూరైన వ్యయం రూ. 636.38 కోట్లు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రైల్వే శాఖ ద్వారా మాత్రమే నిధులు సమకూర్చడం జరిగింది.గుత్తి -ధర్మవరం మధ్య 90 కిలోమీటర్ల మేర పనులు దశలవారీగా చేపట్టారు. మొదటగా కల్లూరు - గార్లదిన్నె మధ్య 13 కిలోమీటర్ల దూరం డబ్లింగ్ మరియు విద్యుద్దీకరణ పనులు సెప్టెంబర్, 2019 లో పూర్తయ్యాయి. దీని తర్వాత చిగిచెర్ల మరియు జంగాలపల్లె మధ్య 11 కిలోమీటర్లు జూన్ 2020లో, గార్లదిన్నె-తాటిచెర్ల మధ్య 9 కిలోమీటర్లు నవంబర్, 2020లో ప్రారంభించబడింది. 2021 అక్టోబర్‌లో కల్లూరు - గుత్తి మధ్య 27కి.మీ.లు మరియు ఆగస్ట్, 2022లో తాటిచెర్ల - జంగాలపల్లె మధ్య 19 కి.మీ.లు. ప్రారంభించబడింది. ఇప్పుడు... చివరి విభాగంలో 11 కి.మీ.ల దూరం వరకు మొత్తం పనులు పూర్తి చేయడంతో రైలు కార్యకలాపాలు సాగించేందుకు గాను ఈ మొత్తం ప్రాజెక్ట్ ప్రారంభించబడింది.ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీగా రద్దీ తగ్గుతుంది. బెంగళూరు మరియు ఆ తర్వాతి స్టేషన్లకు ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్, సరకు రవాణా చేసే రైళ్లను నడపడానికి వీలు కల్పిస్తుంది. ఇది సెక్షన్‌లోని రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే మెరుగైన రైలు కనెక్టివిటీతో ఈ ప్రాంతం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. ధర్మవరం-బెంగళూరు మధ్య నైరుతి రైల్వే పరిధిలోని డబుల్‌లైన్ పనులు కూడా వీటితోపాటు ప్రారంభించడబడి అందులో కొన్ని విభాగాలు పూర్తవడం జరిగింది. కీలకమైన ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.