YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కమలం దారెటు... పొత్తులపై తేల్చని అధిష్టానం

ఏపీలో కమలం దారెటు... పొత్తులపై తేల్చని అధిష్టానం

విజయవాడ, ఫిబ్రవరి 25, 
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పెద్దలు ఓ క్లారిటీకి వచ్చేసినట్టేనా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ అలాగే కనిపిస్తున్నాయి. కమలనాథులతో పొత్తు ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీకి నిరాశే ఎదురవుతోంది. పొత్తులు, కూటములు వంటి అంశాలు సాధారణంగా ఎన్నికల వేళ చర్చకొస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల రాజకీయాలు చాలా ముందే మొదలయ్యాయి. 2020లోనే బీజేపీ-జనసేన కలిసి కూటమిగా ఏర్పడగా.. ఆ రెండు పార్టీలు తమతో కలవాల్సందిగా తెలుగుదేశం పార్టీ సైతం చాలాకాలంగా కోరుతూ వస్తోంది. విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అంతిమంగా అది వైఎస్సార్సీపీకే మేలు చేస్తుందని చెబుతోంది. 2014 మాదిరిగా తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమి కలిసి పోటీ చేస్తే మళ్లీ అధికారం సాధించవచ్చని గుర్తుచేస్తోంది. ఈ ప్రతిపాదనలకు జనసేన కాస్త మెత్తబడినట్టు కనిపిస్తున్నా… బీజేపీ మాత్రం ఏ కోశానా మెత్తబడ్డ సంకేతాలు ఇవ్వలేదు. ఏమాత్రం ఊగిసలాటను కూడా ఎన్నడూ ప్రదర్శించలేదు. పైపెచ్చు.. హస్తిన నుంచి అధిష్టానం పెద్దలు పార్టీ గెలిచినా, గెలవకున్నా.. టీడీపీతో మాత్రం పొత్తు ప్రసక్తి ఉండదనే చెబుతూ వచ్చారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఏ మూలనో ఆశలు సజీవంగానే ఉన్నాయి. కమలనాథులు ఇప్పటికిప్పుడు మెత్తబడకపోయినా.. ఎన్నికలు సమీపించిన తర్వాత ఓకే చేస్తారన్న ఆశతో ఉంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే.. ఇక ఆశలు వదులుకోక తప్పదని అర్థమవుతోంది. ఎన్డీయేను వీడి వెళ్లే క్రమంలో నాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వ్యవహరించి తీరును మోదీ-షా నాయకత్వం ఇప్పటికీ మర్చిపోలేకపోతోందని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.రాజకీయాల్లో ఏ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకోవాలంటే ఆ పార్టీ బలాబలాలను బేరీజు వేసుకుంటారు. పొత్తుతో తమకు ఏం కలిసొస్తుంది? ఎంత మేర ఓట్లు అదనంగా వచ్చి చేరతాయన్న లెక్కలు వేసుకుంటారు. కనీసం 5% ఓటు బ్యాంకు ఉన్నా సరే.. పొత్తు పెట్టుకుంటే ఆ ఓటుబ్యాంకు కలిసి మొత్తం ఫలితాలనే తారుమారు చేయవచ్చని భావిస్తుంటారు. ఈ సూత్రం ప్రకారం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 5.53% ఓట్లు సాధించిన జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు కోరుకోవడం తప్పేమీ కాదు. ఆ ఎన్నికల్లో దాదాపు 50% ఓటుబ్యాంకును కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీని దెబ్బకొట్టాలంటే మిగతా ఓటుబ్యాంకు అంతా ఒక్కచోటకు చేర్చక తప్పదు. తెలుగుదేశం పార్టీ సరిగ్గా అదే వ్యూహంతో అడుగులు వేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ కనీసం 1% కూడా ఓటుబ్యాంకు లేని స్థితిలో ఉంది. జాతీయస్థాయిలో ప్రధాని మోదీ హవాతో రెండోసారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి ఘనవిజయం సాధిస్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో గెలుచుకున్న ఎంపీ సీట్లను కూడా నిలబెట్టుకోలేకపోయింది. అంటే.. కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. అలాంటి పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడడం ఎవరికైనా ఆశ్చర్యం కల్గించే అంశమే. బీజేపీ చేతులు కలిపితే వచ్చి చేరే అదనపు ఓటుబ్యాంకు సంగతి ఎలా ఉన్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కూటమి నైతిక స్థైర్యం పెరుగుతుంది. ఇది తప్ప మరో బలమైన కారణమేదీ కనిపించడం లేదు.అయినప్పటికీ బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఇంటా, బయటా ఒత్తిడి పెంచుతోంది. తెలంగాణలోనూ తెలుగుదేశం ఓటుబ్యాంకు బీజేపీకి అదనపు బలంగా మారుతుంది అంటూ ఖమ్మంలో భారీ సభ నిర్వహించి మరీ సంకేతాలు పంపించింది. అయితే తెలంగాణ బీజేపీ మాత్రం టీడీపీతో చెలిమి లాభం కంటే ఎక్కువ నష్టమే కల్గిస్తుందని అధిష్టానం పెద్దలకు చెప్పి, ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటున్న కొందరు బీజేపీ నేతలు తమ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు. టీడీపీతో పొత్తు లేకపోతే 2019 ఫలితాలే పునరావృతమవుతాయని, పొత్తుంటే గౌరవప్రదమైన సీట్లు పొందవచ్చని ప్రతిపాదించారు. వీలున్న ప్రతిసారీ ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నారు. అయినా సరే, అధిష్టానంలో కదలిక లేదు.ఒకప్పుడు వైఎస్సార్సీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న కన్నా లక్ష్మీనారాయణను ఆపి, తమ పార్టీలోకి తీసుకొచ్చి, రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టిన కాషాయదళం.. అదే వ్యక్తి ఇప్పుడు పార్టీని వీడి వెళ్తానని హెచ్చరించినా సరే పట్టించుకోలేదు. కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కన్నా వెళ్తూ.. వెళ్తూ తనతో పాటు తన వర్గం నేతలనూ తీసుకెళ్లారు. సరిగ్గా అదే రోజు ఓ పాతిక మంది ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకుని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్‌ను కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలి కారణంగానే నేతలు పార్టీ వీడి వెళ్తున్నారని, ఆయనుంటే పార్టీ మరింత నష్టపోతుందని తేల్చి చెప్పారు. అయితే ఈ నేతల బృందం రాక గురించి, వారు చెప్పబోయే అంశాల గురించి ముందే తెలిసినట్టుగా మురళీధరన్ వ్యవహరించడంతో వారంతా షాక్ అయ్యారు. భేటీ పూర్తయ్యాక బయటికొస్తూ నేతలు తమలో తాము మాట్లాడుకుంటూ “ప్చ్.. వచ్చి ఉపయోగం లేకపోయింది. మనం చెప్పేది వినే ధోరణిలో ఆయన లేడు” అని పెదవి విరిచారు. ఇంతమంది ఎందుకొచ్చారంటూ మందలించినట్టుగానూ వారు మీడియాతో చెప్పారు. అంత దూరం ప్రయాసపడి మరీ వచ్చి కలిస్తే.. నిలబడే మాట్లాడారని, కొన్ని నిమిషాలే కేటాయించారని మరికొందరు నేతలు అసంతృప్తి వెలిబుచ్చారు. పొరుగునే ఉన్న తెలంగాణలో కమలదళం పోరాటపటిమను ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకత్వం ఏ సమస్యపైనా పోరాటం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే రాష్ట్ర నాయకత్వంలో కొందరు వైఎస్సార్సీపీకి అనుకూలంగా, కోవర్టులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కానీ అధిష్టానం మాత్రం వచ్చిన నేతలందరూ తెలుగుదేశంతో పొత్తు కోరుకునే వర్గానికి చెందినవారని, వారు చెప్పే విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు తెలిసింది. సోము వీర్రాజును తొలగించాలా.. కొనసాగించాలా అన్నది అధిష్టానం నిర్ణయమని, క్రమశిక్షణ కల్గిన పార్టీ కార్యకర్తల బాధ్యత అధిష్టానం ఆదేశాలను అమలు చేయడమేనని మురళీధరన్ తేల్చి చెప్పినట్టు సమాచారం. మొత్తంగా అధిష్టానం తీరుతో బీజేపీలో టీడీపీ పొత్తు కోరుకుంటున్న వర్గానికి క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది.

Related Posts