YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం..?

కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం..?

హైదరాబాద్, ఫిబ్రవరి 25, 
తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంచు మించుగా  ఏడాది నుంచే ముందస్తు ఊహగానాలు వినిపిస్తూ వచ్చినా, ఎందుకనో గానీ, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ ఇక్కడా అక్కడా ముందస్తు మాట వినిపిస్తున్నా, ఇక ముందస్తు ముచ్చట లేనట్లే అనే అభిప్రాయమే బలపడుతోంది.  అధికార పార్టీ ‘ముఖ్య’ నాయకుడు సహా ఆ పార్టీ నాయకులు అందరూ, ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలే సమయం ఉందని క్యాడర్ ను సన్నద్దం చేస్తున్నారు. జయశంకర్ భూపాల పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలోనూ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయముందనే అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలకంటే, జాతీయ రాజకీయాలపైనే అంతకంటే ముఖ్యంగా, ఏపీలో బీఆర్ఎస్  పార్టీని బలోపేతం చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.  నిజానికి  ఇంతవరకు తెలంగాణ సహా మరే రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకం జరగలేదు. అందుకు ఒకే ఒక్క మినహాయింపు ఆంధ్రప్రదేశ్. టీఆర్ఎస్ పేరు మారి బీఆర్ఎస్ గా అవతరించిన కొద్ది రోజులకే మూడు పార్టీలు మారి వచ్చిన తోట చంద్రశేఖర్‌ ను పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టారు. అంతేకాదు ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకంటే ఏపీ నాయకులకు ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయనీ, వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిపోయేందుకు వీలుగా గ్రీన్ కార్డు ఎంట్రీ సదుపాయం కల్పించారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కేసీఆర్ ప్రత్యేక దృష్టి కారణంగానే ఏపీలో బీఆర్ఎస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయని అంటున్నారు.  తాజాగా విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల బీఆర్ఎస్ లో చేరారు. ఆమెతో పాటుగా మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి,  ఓబీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మాల్యాద్రితో పాటు మరికొందరు  మైనారిటీ నాయకులు  గుంటూరు పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో పార్టీలో చేరారు.విజయవాడ మొగల్రాజపురానికి చెందిన శకుంతల గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేశారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది మేయర్‌గా పనిచేసిన ఆమె, ఆ తర్వాత కాంగ్రెస్‌‌లో కొంత కాలం, ఆ తర్వాత టీడీపీ మరికొంత కాలం పనిచేశారు. చివరకు 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అయితే  అక్కడ ఆమెకు తగిన ప్రాధాన్యత దక్కలేదో ఏమో గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె మరో  మారు కండువా మార్చారు. బీఆర్ఎస్‌లో చేరారు. కారణం ఏమైనా కేసీఆర్ తెలంగాణ రాజకీయాల కంటే, ఏపీ పాలిటిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే ఆయన ఎపీ లోనూ న్యూస్ పేపర్  (నమస్తే ఆంధ్ర ప్రదేశ్) ప్రారంభించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు.  అయితే  ఎంత చేసినా ఏపీలో బీఆర్ఎస్ కు ఓట్లే కానీ సీట్లు రావని రాజకీయ విశ్లేషకులు స్పష్టం  చేస్తున్నారు. అయితే ఆ సంగతి కేసీఆర్ కు తెలియదని అనుకోలేం.   కేటీఆర్’ పట్టాభిషేకం కోసం గ్రౌండ్ ప్రిపేర్  చేసేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా, ఓ వంక ఇటు పార్టీలో,  అటు ప్రభుత్వంలో కేటీఆర్ ప్రాధాన్యత పెంచుతూ,  అదే సమయంలో  జాతీయ రాజకీయాల పేరిట తమ ప్రాధాన్యతను ఉద్దేశపూర్వకంగా తగ్గించుకున్తున్నారని అంటున్నారు.

Related Posts