విజయవాడ, ఫిబ్రవరి 28,
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే సమావేశాలను మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అదేరోజు ఉభయసభలను ఉద్దేశించింగి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇక కీలకమైన బడ్జెట్ ను మార్చి 17వ తేదీన ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించడంతో పాటు సీఎం కూడా మాట్లాడే అకాశం ఉంది. అయితే ఆయా తేదీలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ సర్కార్ యోచించింది. ఎన్నికలతో సంబంధం లేకుండా... సభను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జీ-20 సదస్సులు జరగనున్నాయి. వీటికంటే ముందే శాసనసభ సమావేశాలను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంటే 27వ తేదీలోపే ముగిసే అవకాశం ఉంటుంది.ఈ సమావేశాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తాను విశాఖకు షిప్ట్ అయిపోతానని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని సీఎం జగన్ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా జగన్... కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. మరోవైపు 3 రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆ పరిణామాల ఆధారంగా ముఖ్యమంత్రి ప్రకటన ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక వచ్చే నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు అభ్యర్థుల గెలుపుపైనే పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా ఆదేశించారు. వీరి గెలుపుతో మండలిలో వైసీపీ బలంగా భారీగా పెరగనుంది.మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఏ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో ఊరట దక్కుతుందని ఏపీ ప్రభుత్వం గంపెడాశలతో ఉంది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే చట్టబద్దంగా విశాఖ వెళ్లాలనే ఆలోచన కూడా ప్రభుత్వంలో లేకపోలేదు. విమర్శలకు తావు లేకుండా న్యాయస్థానం అనుమతితోనే విశాఖ వెళుతున్నట్లు ప్రచారం చేసుకోవచ్చు. అదే సమయంలో శాసనసభతో పాటు, మండలిలో ప్రభుత్వం అనుకున్న బిల్లులను ప్రవేశపెట్టి నెగ్గించుకునే అవకాశం కూడా ఉంది.