విజయవాడ, ఫిబ్రవరి 28,
వంగవీటి రాధా.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన రాజకీయ పయనంపై ఎలా ఉండబోతోంది.. 2024 ఎన్నికలు, రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీతో ఉన్నారా. టీడీపీలోనే కొనసాగుతారా, పార్టీ మారిపోతారా. కొద్దిరోజులుగా ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.. పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా.. రాధా మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రాధా పార్టీ మారతారని మరో ప్రచారం జరుగుతోంది.రాధా త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.. ఆయన పార్టీ మారడం ఖాయం అంటున్నారు. వంగవీటి జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఐహాగానాలు వినిపిస్తున్నాయి. ఏకంగా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఉంది. అదే రోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక ఉంటుందని చెబుతున్నారు. అలాగే మార్చి 22 ఉగాది రోజున చేరే అవకాశం ఉందంటున్నారు. రాధా చేరికకు జనసేనాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. వంగవీటితో పాటు యలమంచిలి రవి, పలువురు నేతలు పవన్ సమక్షంలో కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.వంగవీటి రాధా జనసేనలో చేరితే.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే ఒకవేళ టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటే సీట్ల సర్థుబాటు సమస్య కూడా ఉంది. ఒకవేళ జనసేన నుంచి రాధా పోటీ చేస్తే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. బొండా ఉమకు టీటీడీప ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంటుంది. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.రాధా 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. విజయవాడ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వంగవీటి మల్లాది విష్ణు చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరిన రాధా.. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన ఆయన.. ఎక్కడి నుంచి పోటీ చేయలేదు. టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారానికి పరిమితం అయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడంతో పార్టీ మారతారని అప్పట్లోనే ఊహాగానాలు వినిపించాయి. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. రాధా టీడీపీలోనే ఉన్నారని చెబుతున్నా.. ఆయన మాత్రం పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.