బెంగళూరు ఫిబ్రవరి 28 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రకటనకు ముందే ప్రచారానికి దిగుతుండగా, జనతాదళ్ (సెక్యులర్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంచలన ప్రకటన చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలే తాను పోటే చేసే చిట్టచివరి ఎన్నికలని, 2028లో తాను పోటీ చేయనని తెలిపారు. పంచరత్న ప్రచారంలో భాగంగా చెన్నెపట్నలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కుమారస్వామి మాట్లాడుతూ, తాను పోటీకి దూరమైనప్పటికీ రాజకీయాల్లో చురుకుగా ఉంటానని చెప్పారు.''2028 అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేసేది లేదు. రాజకీయాలతో బాగా అలసిపోయాను. విశ్రాంతి అవసరం. అయినప్పటికీ, యాక్టివ్ పాలిటిక్స్‌కు ఎప్పటికీ దూరం కాను'' అని కుమారస్వామి తెలిపారు. చన్నపట్న నుంచి పార్టీ క్యాడర్‌కు టిక్కెట్ ఇచ్చి, అతని విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో రామనగర, చన్నపట్న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కుమారస్వామి పోటీ చేశారు.
పొత్తులుండవు...
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని కుమారస్వామి స్పష్టం చేశారు. 224 అసెంబ్లీ స్థానాల్లో 123 స్థానాలు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.