ఒంగోలు, మార్చి 1,
నవ్విన నాపచేనే పండుతుందన్న సామెత ఏపీ సీఐడీ మాజీ చీఫ్ అనీల్ కుమార్ విషయంలో అక్షరాలా జరిగింది. పదవిలో ఉన్నంత కాలం కన్నూమిన్నూ కానకుండా.. ప్రభుత్వ వ్యతిరేకులన్న ముద్ర వేసి ఇష్టారీతిగా కేసులు బనాయించి, వేధించిన ఫలితంగా ఇప్పుడు ఆయనే స్వయంగా చర్యలు ఎదుర్కొనవలసిన పరిస్థితికి వచ్చారు. నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై చర్యలకు రంగం సిద్ధమైందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఆయనపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీజీపీక రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఏపీ సీఐడీ చీఫ్ హయాంలో రాష్ట్రంలో సామాన్యులపై అక్రమ కేసులు బనాయించి, వారిని కస్టడీలోకి తీసుకుని వేధించడమే కాకుండా.. చిత్రహింసలకు గురి చేశారని ఆరోపిస్తూ హై కోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు చేసిన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఆ ఫిర్యాదపై స్పందించిన కేంద్ర హోం శాఖ ఈ నెల 3న ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డికి లేఖ రాసి తగు చర్యలు తీసుకోవాలసిందిగా ఆదేశించింది. దీంతో ఏపీ సీఎస్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని నిబంధనల మేరకు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. కాగా ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న కాలంలో సునీల్ కుమార్ తీరు అత్యంత వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే. విపక్ష నేతలపై ఇష్టారీతిగా కేసులు బనాయించి, అరెస్టులతో వేధించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన సీఐడీ చీఫ్ గా ఉన్నంత కాలం ఏపీ సీఐడీ అంటే సునీల్ కుమార్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. జగన్ సర్కార్ కొలువుతీరినప్పటి నుంచీ.. ఇటీవల బదలీ అయ్యేంత వరకూ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ తన హయాంలో ఏపీ సీఐడీ ని ప్రభుత్వానికి ఒక ప్రైవేటు సైన్యంలా, విపక్ష నేతలను వేధించడం కోసమే ఈ దర్యాప్తు సంస్థ ఉందా అన్నట్లుగా వ్యవహరించిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టడమే ఏపీ సీఐడి పనిగా పెట్టుకుందని, అందుకోసమే పని చేస్తోందన్న విమర్శలను ఎదుర్కొంది. స్వయంగా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా కూడా జగన్ సర్కార్ ఆయనకు డీజీగా పదోన్నతి కల్పించింది. అయితే పదోన్నతి ఇచ్చిన నెల వ్యవధిలోనే ఆయనపై బదలీ వేటు వేసింది. డీజీ స్థాయిలో ఉన్న ఆయనకు మరో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్, ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ సునీల్ కుమార్ హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది. ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదంగానే మారాయి. విపక్ష నేతలనే కాదు.. సామాన్యులను సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో వేధించారన్న ఆరోపణలు సైతం సునీల్ కుమార్ పై ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ కు ప్రభుత్వం నుంచి పూర్తిగా దన్ను, ప్రోత్సాహం ఉండటంతోనే అలా వ్యవహరించారని పరిశీలకులు సైతం అప్పట్లో విశ్లేషణలు చేశారు. అలాంటి సునీల్ కుమార్ ను ప్రభుత్వం హఠాత్తుగా సీఐడీ చీఫ్ గా తప్పించడం.. ఆ తరువాత ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లాలోని ఒక రెస్టారెంట్, విశాఖ జిల్లాలో ఓ 50 ఎకరాల భూమి విషయంలో సునీల్ కుమార్ తన పరిధి దాటి వ్యవహరించడంతోనే ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టేసిందన్న ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది. అది ఎంత వరకూ నిజమన్నది పక్కన పెడితే.. ప్రభుత్వం ఆయనపై వేటు వేయడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని మాత్రం అందరూ అప్పట్లో భావించారు. మొత్తం మీద ప్రభుత్వానికి సానుకూలంగా.. పరిధి దాటి మరీ వ్యవహరించిన సునీల్ కుమార్ పై ఇప్పుడు అదే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం మాత్రం సంచలనంగా మారింది.