YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూన్ 2 నాటికి చెక్కుల పంపిణీ పూర్తి చేయాలి

జూన్ 2 నాటికి చెక్కుల పంపిణీ పూర్తి చేయాలి

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, కలెక్టర్లతో బుధవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. మంగళవారం వరకు జరిగిన చెక్కుల పంపిణీని సమీక్షించడంతోపాటు, జూన్ 2 నాటికి మొత్తం కార్యక్రమాన్ని ముగించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు ఎంతమంది రైతులకు పాస్‌పుస్తకాలు, చెక్కులు అందించారు? ఇంకా ఎన్ని మిగిలాయి? ఎందుకు మిగిలాయి? వారికి పాస్‌పుస్తకాలు, చెక్కులు ఎప్పుడిస్తారు? అసలు ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. జూన్ 2లోగా పంపిణీ కార్యక్రమం పూర్తి కావడానికి అవసరమైన వ్యూహం ఖరారుచేస్తారు. రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయితీరాజ్ ఎన్నికల ఏర్పాట్లు అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహముద్ అలీ, మంత్రులు, అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.సాంకేతిక కారణాలవల్ల కొన్నిచోట్ల కొందరికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాలేదని, మరికొందరికి చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వడంపట్ల, పంట పెట్టుబడిసాయం అందివ్వడంపట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని అన్నారు. దేశంలో మరే ప్రభుత్వ కార్యక్రమానికీ రానంత గొప్ప స్పందన రైతుబంధుకు వస్తున్నదని సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మిగతా రైతులకు కూడా వాటిని పంపిణీ చేయాలని సీఎం పిలుపునిచ్చారు.రైతుల సంక్షేమానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకే వ్యవసాయరంగానికి ఎక్కువ నిధులిస్తున్నామని తెలిపారు. రైతులకు మేలు చేయగలిగితేనే సాధించిన తెలంగాణకు సార్థకత. రూ.12వేల కోట్లతో రైతుబంధు కార్యక్రమం అమలుచేద్దామంటే చాలామంది భయపడ్డారు. కానీ, రైతులకు నేరుగా మేలుచేసే కార్యక్రమం కాబట్టి మొండి పట్టుదలతో ముందుకుపోయాం. పంట పెట్టుబడికోసం ప్రభుత్వం అందించిన సాయం చేతికందిన తర్వాత రైతుల్లో చెప్పలేని ఆనందం వెల్లివిరుస్తున్నది. అప్పుల బాధలు తప్పాయని ఊరట చెందుతున్నారు అని సీఎం చెప్పారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎక్కడికి తిరుగకుండా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చినందుకు రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇంత పెద్ద పనిచేసిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వం ప్రజలకోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నది. ఎన్నో పథకాలు తెస్తున్నది. కానీ పంట పెట్టుబడి పథకానికి వచ్చినంత గొప్ప స్పందన మరే కార్యక్రమానికి రాలేదు. దేశవ్యాప్తంగా దీనికి ప్రశంసలు లభిస్తున్నాయి అని అన్నారు.

Related Posts