YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు

నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు

పెద్దపల్లి
పెద్దపల్లి నియోజకవర్గంలో అప్రకటిత ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టారు. గత రెండు నెలల నుంచే ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరికి వారే తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. తమ గుర్తింపును కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఏమాత్రం సందు దొరికినా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రతి సమస్యను  ప్రజల మధ్యలో చర్చకు పెడుతున్నారు. అయితే ఎలాగూ ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారు అయిందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గ్రామాలకు పయనమయ్యారు. ఈసారి ఎలాగూ హ్యాట్రిక్ కొట్టేస్తాను అనే ధీమా ఎమ్మెల్యే మదిలో ఉన్నా, ఓటర్ల ఆలోచన ఎలా ఉంటుందో అంచనా వేయడం అసాధ్యమే. పైకి మాత్రం అభివృద్ధి పనులే తనను గట్టెక్కిస్థాయి అనుకుంటున్నా కూడా 8 ఏళ్ల కాలంలో జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుండి ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇటు ప్రజల్లో ఒకంత అసహనం వ్యక్తం అవుతున్నది. ఏదైనా పనికి సామాన్యులు అధికారుల చుట్టూ తిరిగి వేసారుతున్న పనులు కావడం లేదని, అదే అధికార పార్టీ నాయకులను పట్టుకుని వెళితే పనులు త్వరగా పూర్తవుతున్నాయని చాలామంది చాలా సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు. ఇది కూడా టిఆర్ఎస్ పార్టీకి  ఇబ్బందే అని చెప్పాలి. పెద్దపల్లి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రంగా  జరుగుతున్న అభివృద్ధి పనులు ఇంతవరకు పూర్తి కాకపోవడం కూడా ప్రజల్లో వస్తున్న ఆలోచనలకు మార్పు అని చెప్పవచ్చు. అలాగే పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ప్రజల వద్ద నుండి మున్సిపాలిటీలో ఏదైనా పనులకు అనుమతులు కావాల్సి వస్తే డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఇప్పటివరకు సరైన ప్రచార కార్యక్రమాలు  మొదలు పెట్టలేదు. ఈ పార్టీలో సీనియర్ మోస్ట్ గా తలలో నాలుకలా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హోదాలో పని చేసిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమ సెంటిమెంటుతో ఒకసారి గెలిచాడు తప్ప మళ్లీ తనదైన ముద్రను పెద్దపెల్లి నియోజకవర్గంలో చూపించలేదు. ప్రస్తుత పరిస్థితులలో బిజెపికి బయట గాలి బలంగా ఉన్న నియోజకవర్గంలో మాత్రం అత్యంత బలహీనమని చెప్పాలి. మర్రి వృక్షం కింద చిన్న చెట్లు ఎదగవనే సామెతను  ఆయనను చూపిస్తూ పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో బిజెపి ప్రజల పక్షాన ఇప్పటివరకు పోరాటం చేసింది ఏమీ లేదన్నది స్థానిక ప్రజల అభిప్రాయం. ఎలక్షన్  రెండు నెలల ముందు కనిపిస్తాడు ఆ తర్వాత మళ్లీ గెలిచినా గెలవకున్నా ఇటువైపు చూసేది ఉండదు అని చాలామంది వాళ్ళ కార్యకర్తలు చర్చించుకుంటున్న విషయమే. కింది స్థాయి క్యాడర్ చాలా నిరాశలో ఉందన్నది అందరికి తెలిసిన విషయమే. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పలు పాదయాత్రలో ఇప్పటివరకు పెద్దపల్లి నియోజక వర్గ దాపుల్లో కూడా కనిపించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆధిపత్య పోరు ఏ స్థాయిలో కనిపిస్తుందో ఈ సంఘటన అర్థమవు తుంది. టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి అని ప్రచారం చేసుకుంటున్నా కూడా పెద్దపెల్లి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జోరు వినిపిస్తున్నది.  విజయ రమణారావు తనదైన శైలిలో ప్రచారం చేయడమే ఇందుకు నిదర్శనం. ఇక బీసీ వర్గానికి వస్తే ఈసారి కొన్ని పార్టీల్లో బీసీ వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నాయి అందులో బీఎస్పీ, టిడిపి పార్టీలో బీసీలకే టికెట్లు ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. అందుకే పలు పార్టీల చిన్నా చితక బీసీ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా ఒంటరిగానే వ్యక్తిగతంగా తమదైన శైలిలో స్వచ్ఛంద సంస్థల సేవల పేరుతో వారి ప్రచారం వారు ప్రజల వద్దకు వెళుతు, గుర్తింపును పొందడానికి కష్ట పడుతున్నారు. ఎలాగూ పార్టీలో ఉన్నాము, ఈ విధంగా నైనా గుర్తింపు వస్తే బీసీ కోటాలో తమకు ఎమ్మెల్యే  టికెట్ రావచ్చనే చిరు ఆశతో వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారునున్నాయి. దాసరి మనోహర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొడితే మంత్రి పదవి ఖాయమన్న విషయాన్ని అందరూ చర్చించు కుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి, మాజీ ఎమ్మెల్యే విజయ రామారావుకు  గెలుపు సవాల్ గా మారింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన ఆయన ఈసారి ప్రజల మన్నులతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పోరాటం మొదలు పెట్టని బిజెపి మరి ఏ స్థాయిలో గెలుపు ధీమా  వ్యక్తం చేస్తుందో వేచి చూడాలి. బీఎస్పీ, సమాజ్ వాది పార్టీ, టిడిపి ఇలా మరికొన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచారంలో వెళ్తున్నాయి. ప్రధాన పార్టీలు  బీసీ వర్గాలకే ఒకవేళ టికెట్లు గనుక కేటాయిస్తే  పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు చాలా ఖరీదుగా మారే అవకాశాలు లేకపోలేదు. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రతి అసెంబ్లీ స్థానం కీలకంగా మారనున్నది.

Related Posts