YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నష్ట నివారాణ చర్యల్లో ఆదానీ గ్రూప్

నష్ట నివారాణ చర్యల్లో  ఆదానీ గ్రూప్

ముంబై, మార్చి 1, 
షేర్లను కుదవపెట్టి తెచ్చిన రుణాలను చెల్లించేందుకు అదానీ గ్రూప్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాకరుకు ముందే 690-790 మిలియన్‌ డాలర్ల రుణాన్ని  చెల్లించనుందని తెలిసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొందరు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. షార్ట్ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌ బర్గ్‌ (Hindenberg Research) దాడితో నష్టపోయిన పరపతిని తిరిగి దక్కించుకొనేందుకు కంపెనీ శ్రమిస్తోంది.అదానీ గ్రీన్‌ ఎనర్జీ సైతం రీఫైనాన్స్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మూడేళ్ల క్రెడిట్‌ లైన్‌తో 2024 బాండ్ల ద్వారా 800 డాలర్లు జొప్పించనుంది. మంగళవారం హాంకాంగ్‌లో నిర్వహించిన బాండ్‌ హోల్డర్ల సమావేశంలో కంపెనీ యాజమాన్యం తమ ప్రణాళికలను వివరించింది. అప్పులు తీర్చడంపై కంపెనీ ప్రతినిధులు ఎవ్వరూ అధికారికంగా మీడియాకు చెప్పలేదు.అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ నివేదిక బయటకు వచ్చాక అదానీ గ్రూప్‌ కంపెనీలు విలవిల్లాడిపోయాయి. ఇన్వెస్టర్లు ఈ కంపెనీల షేర్లను తెగనమ్మారు. దాంతో జనవరి 24 నుంచి అదానీ గ్రూప్‌ ఏకంగా రూ.12 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను నష్టపోయింది. కాగా నివేదికలో ఉన్న వివరాలన్నీ అవాస్తవాలేనని, తామెలాంటి మోసాలకు పాల్పడలేదని కంపెనీ ప్రతిఘటించింది.ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గించేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఫిబ్రవరి మొదట్లో బాండ్‌హోల్డర్లతో అదానీ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. కొన్ని కంపెనీలకు సంబంధించిన రీ ఫైనాన్స్‌ ప్రణాళికలను వివరించారు. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించబోతున్నట్టు పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌ షేర్లన్నీ లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ధర రోజువారీ కనిష్ఠ స్థాయి నుంచి 24 శాతం పెరిగింది. పది కంపెనీల్లో ఎనిమిది ఎగిశాయి. ఎంఎస్‌ఈఐ వెయిటేజీ మార్పులు, బ్యాంకర్లు రుణాలపై యథాతథ స్థితిని ప్రకటించడమే ఇందుకు కారణాలని తెలిసింది.ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో, గౌతమ్ అదానీ ఇప్పుడు 38వ స్థానంలో ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదిక రాక ముందున్న మూడో స్థానం నుంచి, ఇప్పుడున్న 38వ స్థానానికి, చాలా కిందకు పడిపోయారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ ట్రాకర్ ప్రకారం, ప్రస్తుతం అదానీ నికర విలువ 33.4 బిలియన్ డాలర్లు. 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదిక రాక ముందు ఈ విలువ 119 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నెల రోజుల్లోనే దాదాపు మూడొంతుల సంపద లేదా 85 బిలియన్ డాలర్లకు పైగా కోత పడింది. అయితే, ప్రపంచ ధనవంతులను ఫాలో అయ్యే బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం, ప్రపంచ కుబేరుల్లో అదానీ 30వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 40 బిలియన్ డాలర్లు.

Related Posts