YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరుస తప్పిదాలు... లోపం ఎక్కడా...

 వరుస తప్పిదాలు... లోపం ఎక్కడా...

హైదరాబాద్, మార్చి 1, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ వ్యూహరచనలో ఆరి తేరిన దిట్ట. ఎత్తుకు పైఎత్తులువేసి ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి... అయితే, ఇదంతా  నిన్నటి వైభోగం. ఈ రోజు ఆయన ఏమిటో, ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థమవుతున్నట్లు లేదు. ఆయన ముందులా ఏ విషయం పైన దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఒకడుగు అటు ఒకడుగు ఇటూ వేసి ఎటు కాకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో క్యాడర్  లో గందరగోళం ఏర్పడుతోంది.ఇది ఎవరో పరాయి వాళ్ళో, ప్రతిపక్షాలో చేస్తున్న ఆరోపణ కాదు. బీఆర్ఎస్ లోని  కీలక నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మాంత్రికుడు.. తన వాగ్ధాటితో ఎంతటి వారినైనా మెస్మరైజ్ చేయగలరు. రాజకీయ ఎత్తులు, జిత్తులలో దిట్ట. ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు అంతు చిక్కవు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ టికెట్ పై గెలిచినా బీఆర్ఎస్ లో చేరాల్సిందే అన్నట్లుగా ఆయన రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. గత ఎనిమిదిన్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే.అయితే ఇటీవలి కాలంలో ఆయన ఎత్తులు పారడం లేదు. జిత్తులు చిత్తవుతున్నాయి. మాటలతో మాయ చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వ్యూహాలు వికటిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాలలోనే కాదు.. సొంత పార్టీ శ్రేణులలోనూ ఇదే మాట వినపడుతోంది. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటి నుంచే ఈ పరిస్థితి ఎదురౌతున్నదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతోనే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమౌతున్న సంకేతాలు గోచరిస్తున్నాయన్నారు. ఒక వైపు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తరణకు ప్రణాళికలు రచిస్తూనే.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలుపు బాటలో నడిపించడానికి వ్యూహాలు రచిస్తున్నారు.రెండు పనులూ ఏకకాలంలో చేయాల్సి రావడం వల్లనే ఆయన అటూ ఇటూ కూడా కాన్ సన్ ట్రేట్ చేయలేకపోతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. తొలుత వచ్చే అసెంబ్లీలో సిట్టింగులందరికీ టికెట్లు అంటూ ప్రకటించి, ఒక్కసారిగా వెల్లువెత్తిన అసంతృప్తి, అసమ్మతిని గమనించి పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పార్టీ తలుపులు బార్లా తెరిచి మరీ రెడ్ కార్పెట్ పరిచిన ఫలితం ఇప్పుడు దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ నలుగురైదుగురు పార్టీ టికెట్ ను ఆశిస్తున్న వ్యక్తులు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ రెబల్స్ బెడద ఎదుర్కోవలసిన పరిస్థితి ఉందని అంటున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నప్పటికీ కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించడం వెనుక వ్యూహమేమిటో అర్ధం కాక పార్టీ శ్రేణులే తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.పార్టీ ఎంపీల పనితీరు, వారికి ప్రజలలో ఉన్న అభిమానం, వారిలో మళ్లీ టికెట్ ఇస్తే గెలిచే సత్తా ఉన్నవారెవరు ఇత్యాది అంశాలపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ వారి పనితీరు, విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. అన్నిటికీ మించి వారి ఎంపీ నిధులను ఎలా వ్యయం చేస్తున్నారు. ఏయే పనులకు కేటాయిస్తున్నారు. వంటి అంశాలతో ఇప్పటికే కేసీఆర్ ఒక్కో ఎంపీపైనా సమగ్ర నివేదికను సిద్ధం చేశారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే తన నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మంట్లలో వారి పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయం, అలాగే వారి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో వారి సంబంధాలు ఎలా ఉన్నాయి.. పార్టీ టికెట్ ఇస్తే.. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఆ ఎంపీకి సహకరిస్తారా? లేదా? కనీసం తన నియోజవకర్గ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉందా? వంటి వివరాలన్నీ ఇప్పటికే కేసీఆర్ సేకరించి పెట్టుకున్నారని అంటున్నారు.ఆ వివరాల ఆధారంగానే టికెట్ ఇవ్వాలా వద్దా అన్నది కేసీఆర్ నిర్ణయిస్తారని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలలో గుబులు నెలకొంది. కేసీఆర్ వద్ద ఉన్న నివేదికలలో తమ ప్రోగస్ పై ఉన్న రిపోర్ట్ ఏమిటి? మరోసారి పార్టీ టికెట్ దక్కుతుందా? లేదా అన్న టెన్షన్ పెరిగిపోతున్నది. సరిగ్గా ఇదే పరిస్థితి పార్టీ ఎమ్మెల్యేలలోనూ నెలకొని ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీ అధిష్ఠానం ఎన్నికల సన్నాహాకాలకు సమాయత్తం అవుతుండటం, అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు (సిట్టింగులు) తమకు పార్టీ టికెట్ వస్తుందో రాదో అన్న అయోమయంలో పడటంతో రాష్ట్రంలో ప్రస్తుతం తెరాస పార్టీ పరంగా కార్యక్రమాలేవీ చేపట్టకుండా ఒక విధమైన స్తబ్దతలో కూరుకుపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Related Posts