YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాపం..మంత్రి ధర్మాన

పాపం..మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, మార్చి 6, 
మంత్రి ధర్మాన లెక్క తప్పుతోందా?
ఒకప్పుడు ప్రత్యర్థులపై తన మాటల తూటాలతో విరుచుకుపడేవారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే చిందులు తొక్కుతున్నారు ఈ అమాత్యుల వారు. ప్రస్తుతం మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలో.. అందులోనూ అధికారపార్టీ వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో మంత్రి ధర్మానలో మరో కోణం కనిపిస్తోంది. లాజిక్‌ మిస్‌ అవుతున్నారో ఏమో.. ఆయన మాటలు పార్టీలో మిస్‌ఫైర్‌ అవుతున్నాయనే టాక్‌ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నేతలు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలో ఓ సీనియర్‌ నాయకుడి హోదాలో ధర్మాన చెప్పడంలో తప్పు లేదు. దిశానిర్దేశం చేయొచ్చు. కానీ.. సూచనలు మానేసి వార్నింగ్‌లు ఇస్తున్నారట ధర్మాన. ముఖ్యంగా వైసీపీకి చెందిన ఎంపిటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రతి 50 మందికి ఒక ప్రతినిధి ఉన్నారు. అంతా గమనిస్తున్నానని మంత్రి చెప్పడంతో ఆ కామెంట్స్‌ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ప్రస్తుతం చర్చగా మారిపోయాయి.శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్తు రామారావును వైసీపీ ఎంపిక చేయడం వెనుక మంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్ర ఉందని చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ సీటును వైసీపీలోని తూర్పుకాపు సామాజికవర్గం నేతలు ఆశించినా.. కొత్త సమీకరణాలు.. సరికొత్త లెక్కలు పార్టీ అధిష్ఠానానికి చెప్పి నర్తు అభ్యర్థిత్వానికి ఓకే చేయించుకొచ్చారట ధర్మాన. సరే.. నర్తు రామారావును ఫైనల్‌ చేస్తున్నాం.. ఆయన్ని ఏకగ్రీవంగా గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని మంత్రి ధర్మానకు అధిష్ఠానం చెప్పేసిందట. అంతా అనుకున్నట్టే జరుగుతుందని భావించిన అమాత్యుల వారికి.. నామినేషన్ల దాఖలు తర్వాత సీన్‌ మారిపోవడంతో దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందట. నామినేషన్ల ఉపసంహరణకు రెబల్‌ అభ్యర్థులు అంగీకరించకపోవడం.. ఇప్పుడు పోలింగ్‌ అనివార్యం కావడంతో వైసీపీ అధిష్ఠానం కూడా సీరియస్‌ అయినట్టు సమాచారం. నాయకుల రాజకీయ చాణక్యం ఎన్నికల సమయంలోనే బయట పడుతుంది. గెలవాలి అనుకున్నప్పుడు చతురంగ బలాలను ఫీల్డ్‌లోకి దించుతారు. ఏకగ్రీవం చేయాలంటే అందుకు తగ్గట్టుగా వ్యూహ రచన చేస్తారు. సిక్కోలు ఎమ్మెల్సీ సీటు విషయంలో మంత్రి ధర్మాన లెక్కలు తప్పాయో ఏమో.. పోలింగ్‌ అనివార్యమైంది. దీంతో అటు అధిష్ఠానానికి సమాధానం చెప్పుకోలేక.. ఇటు గెలుపు వ్యూహాలపై పట్టు సాధించేందుకు ఒత్తిడికి లోనై మాట తూలుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో ధర్మానను ఈ విధంగా చూడలేదని.. అనేవాళ్లూ జిల్లాలో కనిపిస్తున్నారు. దిశానిర్దేశాలు మానేసి.. పార్టీ నేతలను బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పార్టీ నేతలు. బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తుడటంతో మంత్రిగారి ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళ్తోందనే ప్రచారం జరుగుతోంది. గతంలో గొర్లె హరిబాబు ఉదంతాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. మరి ఈ సమస్యను మంత్రి ధర్మాన ఎలా అధిగమిస్తారో చూడాలి.

Related Posts