YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంతా ఆయనే చేస్తున్నారు.... చంద్రబాబుపై సోము కంప్లయింట్

అంతా ఆయనే చేస్తున్నారు.... చంద్రబాబుపై సోము కంప్లయింట్

రాజమండ్రి, మార్చి 6, 
పార్టీ నుంచి వెళ్లిపోతున్న వాళ్లంతా ఆయనవైపే వేలేత్తి చూపిస్తున్నారు. ఆయనే కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన మాత్రం.. దీనికంతటికీ ఇంకో ఆయన కారణమని ఉత్తరాలు రాస్తున్నారట. నేరం నాది కాదు.. ఆయనదే.. తప్పు నాది కాదు.. కుట్ర అంతా ఆయనదే… అని చెబుతున్నారట. తప్పించుకోవడానికి చెప్పారా? తప్పు ఆయన మీద తోసేయడానికి చేస్తున్నారో ఏమో.. వ్యవహారం మాత్రం రంజుగా ఉంది. ఏపీ బీజేపీ నుంచి నాయకులు వెళ్లిపోతుంటే.. మౌనంగా ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కామ్‌గా ఢిల్లీ పెద్దలకు లేఖలు రాస్తున్నారట. ఆ లేఖల్లో వీర్రాజు ప్రస్తావిస్తున్న అంశాలే ప్రస్తుతం కాషాయ శిబిరంలో వేడి రాజేస్తున్నాయి. బీజేపీని వీడి నేతలు వెళ్లిపోవడానికి.. బీజేపీ ఇరకాటంలో పడటానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని తేల్చేశారట. లేఖలో చంద్రబాబు గురించి వీర్రాజు ప్రస్తావించారని తెలిసి బీజేపీ వర్గాల్లో హాట్ హాట్‌ చర్చ సాగుతోంది. బీజేపీకి గుడ్‌బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ.. ఇతర నేతలు.. వీర్రాజు వల్లే వెళ్లిపోతున్నట్టు ఓపెన్‌గానే చెప్పారు. ఎన్నడూ లేని విధంగా కొందరు నాయకులు ఏకంగా ఢిల్లీ వెళ్లి వీర్రాజుపై ఫిర్యాదు చేసి వస్తున్నారు. ఈ పరిణామలతో మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో ఏమో.. వీర్రాజు పార్టీ పెద్దలకు లేఖ రాసినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఆ లేఖలో చంద్రబాబును బూచిగా చూపించారనే ప్రచారం నడుస్తోంది. ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి.. కన్నా వంటి లీడర్స్‌ బీజేపీని వీడి వెళ్లిపోవడానికి.. ఇలా అన్నింటికీ చంద్రబాబే కారణమని వీర్రాజు ఆ లేఖలో తేల్చేశారట. చంద్రబాబు జోక్యంతో తమ ప్లాన్‌ అంతా చెడిపోతున్నట్టు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారట వీర్రాజు.బీజేపీ కూటమిని వీడి చంద్రబాబు వెళ్లిన తర్వాత ఆయనపై ఢిల్లీ పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబుకు డోర్స్‌కు క్లోజ్‌ అయినట్టు పలుమార్లు చెప్పారు. ఎలాగూ చంద్రబాబుపై ఢిల్లీ బీజేపీ పెద్దలు ఓ ఓపీనియన్‌తో ఉన్నారని అనుకున్నారో ఏమో.. ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలకు కూడా టీడీపీ అధినేతే కారణమని వీర్రాజు చెప్పినట్టు సమాచారం. ఈ ఎత్తుగడ వీర్రాజుకు పార్టీలో ఏ మేరకు మైలేజ్‌ తీసుకొస్తుందో ఏమో.. చంద్రబాబును మరోసారి ఈ విధంగా టార్గెట్ చేయడం కాషాయ శిబిరంలో ఆసక్తి కలిగిస్తోంది. కన్నా వంటి నేతలు బీజేపీని వీడి వెళ్లడానికి కూడా బాబే కారణమని వీర్రాజు ముక్తాయించడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారట పార్టీ నాయకులు.బీజేపీని వీడి వెళ్లే నేతలు.. ఏదో ఒక కారణం చూపించాలి కాబట్టి.. బట్ట కాల్చి తనపై వేస్తున్నారనేది వీర్రాజు వాదనగా ఉందట. ఇది కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమేనని ఆయన అభిప్రాయమట. ఏపీలో బీజేపీ ఎదిగితే టీడీపీ కష్టమని.. అందుకే ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా బీజేపీపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అధిష్ఠానానికి వీర్రాజు చెప్పారట. కన్నా తరహాలో బీజేపీని వీడి టీడీపీలో వెళ్లే ఆలోచనలో మరికొందరు ఉన్నారంటూ.. వారి పేర్లను ఆ లేఖలో ప్రస్తావించారట వీర్రాజు.ఆ లేఖ నిజంగా వీర్రాజు రాశారో లేదో తెలియదు. ఒకవేళ వీర్రాజే లేఖ రాసి వుంటే.. తన తప్పు లేదని చెప్పుకోవడానికి ఎప్పటిలా చంద్రబాబును వాడేసుకున్నారా అనేది మరికొందరి డౌట్‌. వాస్తవానికి ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో ఢిల్లీలోని పార్టీ పెద్దలకు తెలియంది కాదు. వాళ్లకు ఎక్కడి నుంచి సమాచారం అందాలో అక్కడి నుంచి అందుతోంది. ఇప్పుడు వీర్రాజు రాసినట్టుగా చెబుతున్న లేఖపై వాళ్లెలా స్పందిస్తారు? వీర్రాజు మాటలను విశ్వసిస్తారా? లేక తమ దగ్గర ఉన్న నివేదికను వీర్రాజు ముందు పెట్టి నిలదీస్తారా? ప్రస్తుతం జాతీయ రాజకీయాలు.. కొన్ని రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలపై బిజీగా ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలోని పార్టీ పరిస్థితిపై ఇంకా పూర్తిగా ఫోకస్‌ పెట్టినట్టు లేదు. ఆ సందర్భం.. సమయం చిక్కగానే ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో.. ఏం చేస్తారో చూడాలి.

Related Posts