YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బోట్ షికార్ లేనట్లేనా?

బోట్ షికార్ లేనట్లేనా?

అనకాపల్లిలోని కొత్తూరు పంచాయితీ పరిధిలో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వెనుక చెరువు ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆటవిడుపు కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాక చెరువులో బోటు షికారు ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్ సైతం ఉంది. ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు గతంలో చర్యలు తీసుకున్నా నెరవేరలేదు. చెరువులో బోట్ షికారు కలగానే మిగిలిపోయిందని స్థానికులు అంటున్నారు. వాస్తవానికి ఈ చెరువు పరిసరాలను అనేక రకాలుగా అభివృద్ధి చేసి పార్కుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అనేక సార్లు హామీ ఇచ్చారు. చెరువులో బోటు షికారు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయన హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు ఆ దిశగా చర్యలు జోరందుకున్న దాఖలాలు లేవు. కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. ఎమ్మెల్యే పదవీ కాలం కూడా అయిపోవస్తోంది. ఈ తరుణంలో హామీ అమలు కలగానే మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.

 

అనకాపల్లి పరిసరాల్లో చెప్పుకో తగ్గ స్థాయిలో ఒక్క పార్కు కూడా లేదు. ఒకప్పుడు ఎంతో ఆనందాన్ని పంచిన శారదానది పక్కన ఉన్న అన్నమయ్య పార్కు శారదా బ్రిడ్జి నిర్మాణ సమయంలో కూల్చి వేశారు. దీంతో అక్కడ ఉద్యానవనం శిథిలమైపోయిన దుస్థితి. ఇక ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ప్రకారం కొత్తూరులో పార్కును ఏర్పాటు చేసి ఉంటే పట్టణ ప్రజలకు ఆటవిడుపు కేంద్రంగా ఉండి ఉండేది. అయితే ఆ దిశగా చర్యలు లేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే పీలా హామీ అమలయ్యేలా చొరవ చూపాలని అంతా కోరుతున్నారు. ఇక పీలా సైతం ఈ విషయమై స్పందించారు. ఉద్యానవన అభివృద్ధి చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రైవేట్ సంస్థలు ముందుకు రాకపోవడం వలనే బోటు షికారు నిర్వహించలేకపోతున్నామని ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసే అవకాశం లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే కొన్ని సంస్థలతో మాట్లాడుతున్నా హామీ అమలు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. 

Related Posts