YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వసంత పార్టీ మార్పుకేనా

వసంత పార్టీ మార్పుకేనా

విజయవాడ, మార్చి 6,
విశాఖ పరిపాలన రాజధానిగా చేసుకొని.. త్వరలోనే  ఇక్కడి నుంచే పాలన  ప్రారంభిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్  విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సాక్షిగా ప్రకటించారు.  అయితే  ఉమ్మడి కృష్ణాజిల్లా  మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాత్రం మూడు రాజధానులనేది వైసీపీ విధానమైతే కావచ్చు కానీ తాను మాత్రం  ఏకైక రాజధాని అమరావతికే మద్దతిస్తానని విస్ఫష్టంగా చెప్పేశారు.అదీ విశాఖ పరిపాలనా రాజధాని అని జగన్ ప్రకటించడానికి సరిగ్గా ఒకే ఒక్క రోజు ముందు అంటే  వసంత కృష్ణ ప్రసాద్ ఈ విషయం చెప్పారు. ఆయనేం జగన్ విశాఖ పరిపాలనా రాజధాని అని ప్రకటిస్తారని తెలియక  చెప్పిన మాట కాద. విశాఖ రాజధానిగా తాను త్వరలో పాలన ప్రారంభిస్తానని జగన్ గతంలో కూడా విస్పష్టంగా ప్రకటించారు. మూడు రాజధానులే తమ విధానమని గత మూడున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న తన మద్దతు అమరావతికేనని విస్పష్టంగా చెప్పారు. అది కూడా జగన్ మానస పుత్రిక లాంటి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన   కవులూరులో  పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన్ని గ్రామస్థులు అడ్డుకొని.. రాజధానిపై మీరు ఇలా సైలెంట్‌గా ఉంటే ఎలా? రాజధాని అమరావతిపై మీ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో భూముల రేట్లు పడిపోయాయని వారు ఎమ్మెల్యే ఎదుటే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళనతో ఆయన ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయి.. అమరావతికే నా ఓటు అంటు క్లియర్ కట్‌గా వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.వసంత ఇలా అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరే యోచనలో ఉన్నారన్న ప్రచారం ఒక్క సారిగా జోరందుకుంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా వసంత కృష్ణ ప్రసాద్ ఇలా అమరావతికే నా మద్దతు అంటే చెప్పారో లేదో.. అలా పార్టీలో వసంత కృష్ణ ప్రసాద్ ప్రత్యర్థి వర్గం, అంటే  మంత్రి జోగి రమేష్ వర్గం వెంటనే రంగంలోకి దిగి విమర్శలు గుప్పించింది. సామాజిక మాధ్యమం వేదికగా ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. వీరికి దీటుగా వసంత వర్గం కూడా సామాజిక మాధ్యమంలో రిటార్డులు సంధిస్తోంది. ఒక విధంగా ఇరువురి వర్గాల మధ్యా సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతోంది.   వసంత వైసీపీతో బంధం తెంచుకుంటారన్న ప్రచారం జోరందుకోవడానికి ఆయన తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వైసీపీపై ఇటీవల బహిరంగంగానే విమర్శలు గుప్పించడం, విజయవాడ ఎంపీ, తెలుగుదేశం నాయకుడు కేశినేని నానితో భేటీ కావడం కూడా కారణమేనని చెబుతున్నారు. ఇక వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీ లైన్ కు భిన్నంగా ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడడాన్ని కూడా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అదెప్పుడంటే.. కొద్ది రోజుల కిందట  ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుంటూరులో చంద్రన్న కానుక కార్యక్రమంలో   జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు..  దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై వైపీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్  ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు చాలా కాలంగా తెలుసునని.. మంచి వ్యక్తి అని.. తనకు స్నేహితుడు అంటూ మీడియా ముందుకు వచ్చి  చెప్పడమే కాదు.. ఇలా జన్మభూమికి ఎంతో కొంత సేవ చేస్తూన్న ఇలాంటి ఎన్నారైలపై కేసులు పెడితే.. భవిష్యత్తులో మరే ఎన్నారై జన్మభూమికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రారని అన్నారు. ఇది కూడా ఆయన వైసీపీ లైన్ కు భిన్నంగా వెళుతున్నారనడానికి తార్కానంగా పరిశీలకులు చెబుతున్నారు.ఇక ఇటీవలి కాలంలో వసంత కృష్ణ ప్రసాద్, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ సైకిల్ ఎక్కేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అయితే వీరిద్దరి పంచాయతీ జగన్ వరకూ వెళ్లింది. దీంతో జగన్ వీరిద్దరినీ కూర్చో బెట్టి సమన్వయం కుదిర్చారు. మైలవరం టికెట్ వసంతకృష్ణ ప్రసాద్ కే అని స్పష్టం చేయడమే కాకుండా.. నియోజకవర్గాలలో జోక్యం వద్దని జోగి రమేష్ కు విస్పష్టంగా చేప్పారని అప్పట్లో పార్టీ శ్రేణులే చెప్పాయి. దీంతో ఇరువురి మధ్యా సమన్వయం కుదిరిందని అంతా అనుకుంటున్న సమయంలోనే రాజధాని విషయంలో వసంత కృష్ణ ప్రసాద్ ఇచ్చిన క్లారిటీ మళ్లీ ఆయన పార్టీ మార్పు చర్చను తెరమీదకు తెచ్చింది.
 ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ ను ప్రస్తావనకు తీసుకు వస్తున్నారు. ఆయన కూడా అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం పాదయాద్ర నెల్లూరులో ప్రవేశించిన సందర్భంగా వారిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న తరువాతే జగన్ తో గ్యాప్ పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ అమరావతికి మద్దతుగా మాట్లాడటంతో ఆయనకు ఇక పార్టీలో కొనసాగే అవకాశాలు మృగ్యమైనట్లేనని అంటున్నారు.  

Related Posts