YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగమాగం..ఆగమాగం...అన్నవరం

ఆగమాగం..ఆగమాగం...అన్నవరం

కాకినాడ, మార్చి 6,
 ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపలా కాస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని పర్యవసానం ఇప్పుడు కాకపోయినా ముందు ముందు తెలియక తప్పదని పలువురు అంటున్నారు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో జరుగుతున్న ఈ వ్యవహారంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు విలువచేసే స్వామి వారి బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలను కేవలం భద్రత సిబ్బంది బాధ్యతకే వదిలేసి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి.దేవస్థానంలో ఎస్పీఎఫ్, దేవస్థానం, పోలీస్ హోంగార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు వెరసి సుమారు వంద మందికి పైగా ఆలయ పరిరక్షణ కోసం కాపలా కాస్తున్నారు. వీరిలో కొంతమంది గార్డులు ఆలయంలో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో తప్ప మిగతా చోట్ల విధులు నిర్వహించిన దాఖలాలు లేవు. అధికారుల సిఫార్సులతో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్ట వేసుకుని కూర్చుంటున్నారని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా అంతరాలయంలో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బంది విధులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే భక్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి వెంట తీసుకొచ్చే బ్యాగులను తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. అయితే, సెల్ ఫోన్లలో చిట్ చాట్ చేస్తూ కాలం గడుపుతున్నారు. దేవస్థానం సెక్యూరిటీ గార్డులు కొంతమంది తూర్పు రాజగోపురం, ప్రధానాలయం, 1500 వ్రతాలు తదితర ప్రదేశాలలో తప్ప మిగతా చోట్ల పనిచేసినట్లు రికార్డులలో ఎక్కడా లేదని తెలుస్తుంది. భద్రత కోసం కాకుండా కేవలం ఆధిపత్యం కోసమే కొంతమంది గార్డులు అయా ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా లక్షల్లో జీతాలు చెల్లిస్తున్న దేవస్థానం అధికార యంత్రాంగం వీరి విధులపై ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు.దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది అంతరాలయం వెలుపల మాత్రమే గస్తీ నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడి అధికారుల ఉదాసీనత కారణంగా ఎస్పీఎఫ్ సిబ్బంది అంతరాలయంలోకి ప్రవేశించే భక్తుల దర్శనం టికెట్లను ఇవ్వడం, దేవస్థాన సిబ్బందితో కబుర్లు చెప్పుకోవడం వంటివి నిరంతరం కనిపిస్తూనే ఉంటుంది. నిరంతరం సీసీ కెమేరాలు ఉన్నప్పటికీ అధికారులు వాటిని గమనించకపోవడం విచారకరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.

Related Posts