తిరువనంతపురం, మార్చి 6,
మావోయిస్టులు రూటు మార్చారా? డబ్బుల్ని డంపుల్లో కాకుండా బ్యాంక్ అకౌంట్లలోనూ, మ్యూచువల్ ఫండ్లలోనూ దాస్తున్నారా? అవుననే అంటోంది.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐయే. జార్ఖండ్‌కు చెందిన ఓ కేసులో ఏకంగా 152 బ్యాంక్ అకౌంట్లతో పాటు.. 20 కోట్లకుపైగా డబ్బు ఉన్న ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఖాతాను అటాచ్ చేసింది. జార్ఖండ్‌లో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐయే. ఓ సంస్ధ, దాని భాగస్వాములు మావోయిస్టులతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారని, వారికి నిధులు సమకూరుస్తున్నారని తేల్చింది.2019లో జార్ఖండ్‌లోని లతేహార్‌లో పోలీసు వాహనంపై దాడి చేసిన మావోయిస్టులు.. నలుగురు పోలీసులను చంపి, వారి దగ్గరున్న ఆయుధాలను లూటీ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్ఐయే.. సంతోష్ కన్‌స్ట్రక్షన్ భాగస్వాముల్లో ఒకరైన మృత్యుంజయ్ కుమార్ సింగ్‌ను నిందితుడిగా గుర్తించి.. మావోయిస్టులతో అతని సంబంధాలపై ఆరా తీసింది. మావోయిస్ట్ ప్రాంతీయ కమిటీ సభ్యుడైన రవీంద్ర గంజాకు.. మృత్యుంజయ్ కుమార్ సింగ్ డబ్బు సమకూర్చినట్లు తేల్చింది.లతేహర్‌లో పోలీస్ వాహనంపై రవీంద్ర గంజా నేతృత్వంలోని మావోయిస్టుల బృందం దాడి చేయడానికి ఒక రోజు ముందు కీలక పరిణామం జరిగింది. బీర్‌జంఘా అడవిలో మృత్యుంజయ్.. గంజాను కలుసుకున్నాడు. అతనికి 2 లక్షల రూపాయలు ఇచ్చాడని.. ఆ డబ్బుతోనే దాడికి గంజా ప్రణాళిక రూపొందించాడని ఎన్‌ఐఏ చెబుతోంది. మృత్యుంజయ్ ఇంటి నుంచి కూడా 2.5 లక్షల రూపాయలను ఎన్ఐయే స్వాధీనం చేసుకుంది. మావోయిస్టుల పేరుతో డబ్బు వసూలు చేసి.. వాటిని బ్యాంక్ అకౌంట్లలోనూ, మ్యూచువల్ ఫండ్లలోనూ దాచిపెట్టి.. అవసరమైనప్పుడు మృత్యుంజయ్ మావోయిస్టులకు ఇస్తూ వస్తున్నాడని ఎన్ఐయే నిర్ధారించింది. 152 బ్యాంక్ అకౌంట్లతో పాటు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఖాతాలో ఉన్న 20 కోట్ల రూపాయలకు పైగా నగదును అటాచ్ చేసింది.