YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మార్చి 9న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

మార్చి 9న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్,  మార్చి 6, 
మార్చి 9న తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. పలు పథకాలు, నిధులు, ప్రభత్వ విధానాలకు సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. బడ్జెట్ ఆమోదం కోసం గత నెలలో భేటీ అయిన కేబినెట్.. ఆ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోద ముద్ర వేసింది. ఆ భేటీలో కేవలం అన్ని అంశాలపైనే చర్చ జరిగిన నేపథ్యంలో... మరిన్ని అంశాలపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను సమీక్షిస్తోన్న సర్కార్... వాటి ద్వారా ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్ల అర్హత వయసుని తగ్గించి... కొత్త పింఛన్లు మంజూరు చేసింది. కొత్త రేషన్ కార్డులనూ అందించింది. సొంత స్థలం ఉండి.. ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ స్కీమ్ ను అమలు చేయాలని చూస్తోన్న ప్రభుత్వం... ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంపికకు సంబంధించిన నిబంధనలు, నిధుల మంజూరు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇటీవలే చర్చించింది. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీని వల్ల కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. బీపీఎల్ కుటుంబాలకు ఇళ్ల పట్టాల మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2014లో 1.25 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సొంతింటి నిర్మాణంతో పాటు... ఇళ్ల స్థలాల పంపిణీపైనా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts