YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రిమ్స్ లో తాగునీటి ఇక్కట్లు

రిమ్స్ లో తాగునీటి ఇక్కట్లు

ఎండలు మండిపోతున్నాయి. బయటకు వచ్చినవారు దాహార్తితో సతమతమవుతున్నారు. ఇదిలాఉంటే ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్ద ఆసుపత్రి అయిన రిమ్స్‌లోనూ తాగునీటికి ఇబ్బంది ఉన్నట్లు అంతా అంటున్నారు. ఇక్కడ తాగు నీరు అందుబాటులో లేక రోగులు, వారి సహాయకులు దాహంతో అల్లాడిపోతున్నారని చెప్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం తాగునీటి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటంతో రోగులు, సహాయకులు నానాపాట్లు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి ఆసుపత్రిలో తాగునీటి ఏర్పాటు ఉంది. అయితే అవి పూర్తిస్థాయిలో పనిచేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హాస్పిటల్ మొదటి అంతస్తులోని శుద్ధజల ప్లాంటుకు నీటి సరఫరా లేకపోవటంతో అది మూలనపడిందని సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రి బయట స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని శుద్ధజల ప్లాంటు నీటిపైనే అంతా ఆధారపడుతున్నారు. ఈ నీరే రోగులు, సహాయకులకు దిక్కవుతున్న పరిస్థితి. ఇక్కడా నీరు లేకుంటే బయట నీటి సీసాలు కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి నెలకొంది.

 

రిమ్స్‌లో రోజుకు ఆరువందల వరకు రోగులు చికిత్స పొందుతుంటారు. వీరితో వచ్చే సహాయకులు, బయటి రోగులు, సందర్శకులు దాదాపు మరో రెండు వేల మంది ఉంటారు. ఇంతమంది ఉండే హాస్పిటల్ లో తాగునీటికి కటకట నెలకొనడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే ఆసుపత్రికి వచ్చినవారికి దాహం వేస్తే తప్పనిసరిగా బయటి నీటి సీసాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వాసుపత్రికి బడుగులే అత్యధికంగా వస్తుంటారు. వారి ఆర్ధిక స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉంటాయి. దీంతో మంచినీరు కొనుగోలు చేయడం వారికి మరింత ఆర్ధికంగా భారమవుతున్న పరిస్థితి. అందుకే హాస్పిటల్ లోని తాగునీటి సమస్యపై అంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏదైతేనేం రిమ్స్ కు వచ్చినవారు దాహం తీర్చుకోవటానికి తీవ్ర ఇబ్బందుల పాలవ్వటం పరిపాటిగా మారింది. ఆసుపత్రిలోని ఏ అంతస్తులో ఉన్నా రాత్రి, పగలు తేడా లేకుండా కింది వరకు వచ్చి నీటిని పట్టుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని తాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అంతా అధికార యంత్రాంగాన్ని కోరురుతున్నారు.

Related Posts