YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాళేశ్వరానికి కాగ్....

కాళేశ్వరానికి కాగ్....

కరీంనగర్, మార్చి 10, 
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయనే విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రాజెక్టు పనుల్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కార్యాలయం సిద్ధమైంది. ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనానికి సిద్ధమైంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోత ప్రాజెక్టు నిర్మాణంపై కాగ్ దృష్టి సారించింది. ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఇప్పటికే విపక్షాలు పలుమార్లు ఆరోపించాయి. కాంగ్రెస్‌తో పాటు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్లి మరీ ప్రాజెక్టు నిర్మాణంపై ఫిర్యాదులు చేశారు.ప్రాజెక్టు నిర్మాణంపై గత ఏడాదిన్నరగా తెలంగాణ ప్రభుత్వాన్ని కాగ్‌ పలు రకాల సమాచారం అడగటం, నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడం, కాగ్ బృందాలకు వచ్చే సందేహాలకు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు వివరణ ఇవ్వడం, వాటిపై కొర్రీలు వేయడం జరుగుతోంది.ఇటీవల కాగ్‌ ఉన్నతాధికారి నేరుగా కాళేశ్వరం పనులను పరిశీలించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ చక్రవర్తి  11వ తేదీన అన్నారం పంపుహౌస్‌, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్‌ ఇంజినీర్‌కు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌‌లకు లేఖ రాశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పలు అంశాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఇచ్చిన వివరాలపై ఇప్పటికే వివరణల మీద వివరణలు కోరుతోంది. వాటిపై పలు దఫాలు సమీక్షలు కూడా జరిగాయి. క్షేత్రస్థాయి పర్యటనలు జరిగిన తర్వాత ఇప్పుడు మూడోసారి పరిశీలనకు ఉన్నతస్థాయి అధికారి నేరుగా వస్తుండటం నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చగా మారింది.కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అధికారులు రెండు వేర్వేరు లేఖలు రాశారు. డిజైన్ల నుంచి పనుల వరకు అన్ని రకాల సమాచారాన్ని కోరారు. ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేసి ఉంటే ఆ వివరాలు కూడా ఇవ్వాలని కోరారు. టెండర్ల పరిశీలన డాక్యుమెంట్లు, డిజైన్లు, డ్రాయింగులు, పెరిగిన ధరల వివరాలను ఇరిగేషన్ అధికారుల్ని కోరారు. వీటిలో చాలా వరకు వివరాలను అధికారులు కాగ్‌ కార్యాలయానికి పంపారు.మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి టెండర్‌ డాక్యుమెంట్లతోపాటు ఎన్‌ఐటీ, ఇంజినీరింగ్‌ రీసెర్చి ల్యాబొరేటరీ చేసిన అధ్యయనాలు, నిర్మాణ సమయంలో వినియోగించిన డీజిల్‌, లేబర్‌ ఛార్జీలు, ఇతర మెటీరియల్‌ కొనుగోలు, గేట్లకు సంబంధించిన ధరల వివరాలు, జీఎస్టీ చెల్లింపులు, ఎం.బుక్‌ లో వివరాల నమోదు, మొదట నిర్ణయించిన దానికి భిన్నంగా జరిగిన మార్పులు తదితర అంశాలపై వివరాలను కోరినట్లు తెలుస్తోంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, మూడు లిప్టులకు సంబంధించి కూడా ఇదే సమాచారాన్ని కోరారు.తెలంగాణలో జరిగిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కాగ్ పరిశీలన కాక రేపుతోంది. ఇందులో ఏవైనా అక్రమాలు వెలుగు చూస్తే చిక్కులు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.

Related Posts