ఒక్క రోజు లాభాల బాట పట్టిన దేశీయ మార్కెట్లు అంతలోనే ఉసూరుమనిపించాయి. బుధవారం ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి. చివరి గంటన్నరలో అమ్మకాలు ఊపందుకోవడంతో చివరికి భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు క్షీణించి 34,347 వద్ద నిలవగా.. నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,429 వద్ద స్థిరపడింది. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టపోగా.. ఆసియా, యూరప్ మార్కెట్లు సైతం తిరోగమన దిశగా పయనించడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెప్పారు. దీనికితోడు రూపాయి ఏడాదిన్నర కనిష్టం 68.28ను తాకడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు తెలియజేశారు.పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటం కూడా భారత మార్కెట్ల పతనానికి కారణమై ఉండొచ్చని బ్రోకర్లు చెబుతున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఎస్బీఐఎన్(3.56%), ఎన్టీపీసీ(0.82%), ఎల్ అండ్ టీ(0.55%), టాటా మోటార్స్(0.49%), ఎం అండ్ ఎం(0.05%) లాభాల్లో ముగియగా మరో వైపు టాటాస్టీల్(6.57%), ఓఎన్జీసీ(4.75%), డాక్టర్ రెడ్డీస్(2.92%), ఇండస్ ఇండ్ బ్యాంక్(2.80%), ఐటీసీ(1.92%), అదానీ పోర్ట్స్(1.80%) అత్యధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 30 కంపెనీల్లో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే లాభపడగా మిగిలినవన్నీ నష్టాల బాట పట్టాయి.