YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ తో ముందుకెళితే... వ్యూహారచనల్లో కేసీఆర్

కాంగ్రెస్ తో ముందుకెళితే...  వ్యూహారచనల్లో కేసీఆర్

హైదరాబాద్, మార్చి 11, 
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు... మిత్రులు ఉండరు... అన్నది నానుడి. ప్రస్తుతం గులాబీ పార్టీ ఆ దిశగానే అడుగులు వేసే దిశగా వ్యూహారచన చేస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి. నిన్న మొన్నటి దాకా ఇష్టారీతిన నోరు పారేసుకుని విమర్శించిన కాంగ్రెస్ తోనే చేతులు కలిపేందుకు తహతహలాడాల్సి వస్తోంది. ఔను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు?  రాష్ట్రంలో అధికారం నిలుపుకునే వ్యూహంలో భాగంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో చెలిమి  కోరుకుంటుటున్నారు? ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ చేసిన ప్రసంగం, అలాగే, అంతకు ముందు విలేకరుల సమవేశంలో  కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కితాబునిస్తూ చేసిన వాఖ్యాలను గమనిస్తే  కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో చెలిమి కోరుకుంటున్నారనే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిన్న మొన్నటిదాకా అనధికార మిత్ర పక్షాలుగా చెలామణి అయ్యాయి. మోడీ ప్రభుత్వం తెచ్చిన వివాదస్పద వ్యవసాయ చట్టాలు మొదలు పెద్ద నోట్ల రద్దు చట్టం వరకు,  కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ  వ్యతిరేకించిన అనేక చట్టాలకు  బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మోడీకి జై కొట్టింది. పెద్దల సభలో  స్నేహ ధర్మాన్ని చక్కగా పోషించింది.  సరే ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు చెడిన తర్వాత అవే వ్యవసాయ చట్టాలను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన చేసింది. అది వేరే విషయం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత వరకు గులాబి పార్టీ ముఖ్య నాయకులు చేస్తున్న ప్రకటనలు గమనిస్తే  బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.   రాష్ట్రంలో రాజకీయ అవసరాలతో పాటుగా, జాతీయ స్థాయిలో కేంద్ర  దర్యాప్తు సంస్థల దాడి నుంచి రక్షణ పొందేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలకు బీఆర్ఎస్ నాయకత్వం సుముఖంగా ఉందనే సంకేతాలు స్పష్ట మవుతున్నాయని అంటున్నారు.  తాజగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ, అరెస్ట్ కు సిద్దమవుతున్న ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత    కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ తో చెలిమి కోరుకుంటున్న సంకేతాలను మరింత స్పష్టం చేశాయని అంటున్నారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ జంతర్‌ మంతర్‌లో నిర్వహించదలచిన దీక్షకు సోనియా గాంధీని ఆహ్వానించారా అన్న విలేకరుల ప్రశ్నకు కవిత..  సోనియా గాంధీ చాలా పెద్ద నాయకురాలు.. నేను చాలా చిన్న నాయకురాలిని.  అంతే కాదు,   సోనియా మెడలో ఒక మెచ్చుకోలు హారం కూడా వేశారు. 2010లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఎ సంకీర్ణ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా బిల్లు పెట్టడంలో సోనియా కీలక పాత్ర పోషించారని,  ఆమె ధైర్యానికి దేశ మహిళల తరఫున ‘సెల్యూట్‌ ’ చేస్తున్నానని కవిత వ్యాఖ్యానించారు.  బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ-టీమ్‌ అని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్పి స్పందిస్తూ, ప్రస్తుతం దేశంలో ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మాత్రమే మిగిలిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో కలవాలని సూచించారు. సరే ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ పార్టీ భ్రమల్లోంచి బయటకు రావాలని అంటూ ఒకటి రెండు చిన్న చిన్న చురకలు కూడా అంటించినా,  మొత్తంగా చూస్తే,  బీఆర్ఎస్ నాయకత్వం హస్తంతో దోస్తీనే కోరుకుంటోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే  కొసమెరుపు ఏమంటే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలు లేవని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు.దీక్షకు ప్రతినిధులను పంపాలంటూ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆహ్వానించినట్లు కవిత ప్రకటించినా..  ఉద్దేశపూర్వకంగానే ఈ దీక్షకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని ఆయన తెలిపారు.  ఒక పార్టీ ఎమ్మెల్సీ చేసే దీక్షకు తాము వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన పేర్కొన్నారు.  జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే..  కాలం కలిసి రానప్పుడు తాడే పామై కాటేస్తుందన్న సామెత  ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితికి అద్దం పట్టినట్లుగా సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Related Posts