YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ కు కుకింగ్ కోల్ ఇబ్బందులు

స్టీల్  ప్లాంట్ కు కుకింగ్ కోల్ ఇబ్బందులు

విశాఖపట్టణం, మార్చి 14, 
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌  ఎదుర్కొంటున్న కోకింగ్‌ కోల్‌, ఐరన్‌ ఓర్‌ కొరత సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. భారీ పెట్టుబడులతో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏటా 3.2 మిలియన్‌ టన్నుల నుంచి 7.3 మిలియన్‌ టన్నులకు విస్తరిస్తే ప్రస్తుతం అందులో మూడింట ఒకటో వంతు మాత్రమే ఉక్కు ఉత్పత్తి జరుగుతున్న విషయం వాస్తవమేనా అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అది వాస్తవం కాదని చెప్పారు.వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌, స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ను అధునీకరించి 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచినప్పటికీ సమగ్ర ఉక్కు ఉత్పాదన సామర్ధ్యాన్ని 7.3 మిలియన్ టన్నులకు విస్తరించలేదని మంత్రి తెలిపారు. అలాగే తీరప్రాంతంలో ఉన్నందున వాతావరణంలోని ఉప్పు సాంద్రత కారణంగా స్టీల్‌ ప్లాంట్‌లోని భారీ పరికరాలకు తుప్పు పట్టే అవకాశం లేదా అన్న మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ను తీరప్రాంతంలో నెలకొల్పుతున్నందున ఎక్విప్‌మెంట్‌ సమకూర్చుకునే దశలోనే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. పూర్తి సామర్ధ్యం మేరకు స్టీల్‌ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పాదన జరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల గురించి మంత్రి ఈ విధంగా వివరించారు.
1) వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు నిరాటంకంగా కోకింగ్‌ కోల్‌ సరఫరా చేసే అంశంపై బొగ్గు మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం.
2) వైజాగ్‌ స్టీల్‌ కోసం ఒక ఇనుప ఖనిజం బ్లాక్‌ను ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా ఒడిషా ప్రభుత్వాన్ని కోరడం జరగింది.
3) ఇనుప ఖనిజ నిక్షేపాలను తమ కోసం ప్రత్యేకంగా రిజర్వ్‌ చేయవలసిందిగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయమంటూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ఇప్పటికే ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలను కోరింది.
4) స్టీల్‌ ప్లాంట్‌ వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాల కోసం సులభతరమైన వడ్డీతో రుణాల మంజూరు కోసం వైజాగ్‌ స్టీల్‌ యాజమాన్యం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఎదుర్కొంటున్న పలు ఇతర ఇబ్బందులను అధిగమించేందుకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Related Posts