YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా, కోడికత్తి కేసులతోనే ఇబ్బందులు

వివేకా, కోడికత్తి కేసులతోనే ఇబ్బందులు

విజయవాడ, మార్చి 14, 
2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి ప్రధాన కారణాలలో ముందువరుసలో ఉన్న ఆ రెండు సంఘటనలే ఇప్పుడు 2024 ఎన్నికలలో అదే వైసీపీకి ప్రతికూలంగా మారనున్నాయా? అంటే వైసీపీ శ్రేణుల నుంచి సామాన్య జనం వరకూ ఔననే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ రెండు సంఘటనలూ ఏమిటంటే.. ఒకటి విశాఖ విమానాశ్రయంలో అప్పటికి విపక్ష నేతగా ఉన్న జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కాగా రెండోది..   జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురి కావడం. ఈ రెండు సంఘటనలూ   జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదపడ్డాయనడంలో సందేహం లేదు.సరే ఆ తరువాత ఎన్నికలలో విజయం సాధించి జగన్ అధికారంలోకి వచ్చి కూడా నాలుగు సంవత్సరాలు కావస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలోనూ ఈ రెండు సంఘటనలకు సంబంధించిన కేసులూ ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. కోడి కత్తి కేసు విషయానికి వస్తే.. తనపై దాడి జరిగిందంటూ అప్పట్లో ఊరూవాడా ఏకం చేసి ఎన్ఐఏ దర్యాప్తును సాధించుకున్న జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యాకా.. ఆ కేసు ను పట్టించుకున్న దాఖలాలే లేవు. పైపెచ్చు ఈ కేసు ముందుకు సాగాలంటే.. బాధితుడిగా జగన్ కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు పేర్కొన్నా.. జగన్ హాజరు కావడం లేదు. ఈ నాలుగేళ్లుగా ఈ కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను అనే యువకుడు రిమాండ్ ఖైదీగానే మగ్గిపోతున్నాడు. తనపై హత్యాయత్నం కేసు విచారణ పూర్తై నిందితుడికి శిక్ష పడాలన్న భావన జగన్ లో  ఏ కోశానా కనిపించడం లేదు. అసలా సంఘటనే జరగలేదన్నట్లుగా ఆయన తీరు కనిపిస్తోంది. ఇక సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయాన్నే తీసుకుంటే.. అప్పట్లో అప్పటి అధికార పక్షమే ఈ దారుణానికి కారణమంటూ గగ్గోలు పెట్టిన జగన్.. విపక్ష నేతగా ఈ హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. కానీ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులకు శిక్ష పడాల్సిందేననీ, ఈ హత్య వెనుక పాత్రధారులు, సూత్రధారులు వెలుగులోనికి రావాల్సిందే అంటూ పట్టుబట్టి సీబీఐ దర్యాప్తును సాధించారు. ఆ తరువాత సీబీఐ దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా..అడ్డంకులు అవాంతరాలు కలగడంతో మళ్లీ సునీతే సుప్రీం ను ఆశ్రయించి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలీ చేయాలని కోరింది. సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని నివేదించింది. దీంతో కేసు విచారణ తెలంగాణకు మారింది. అప్పటి నుంచీ దర్యాప్తులో వేగం పెరిగింది. కేసు దర్యాప్తు వేగంగా వివేకా హత్య వెనుక సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది లేల్చే దిశగా సాగుతోందన్న అభిప్రాయమూ అందరిలో కలిగింది. సరిగ్గా ఈ తరుణంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ దర్యాప్తు తీరు సరిగా లేదని ఆరోపిస్తూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించాలంటూ కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఈ హత్య వైఎస్ వివేకా అల్లుడే చేశాడంటూ ఆరోపించారు. సరే ఇదంతా కొద్ది సేపు పక్కన పెడితే..కోడికత్తి కేసు, వివేహా హత్య కేసు ఈ రెండిటి విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను మసకబార్చిందనడంలో సందేహం లేదు. విపక్షంలో ఉన్న సమయంలో ఒకలా, అధికారంలోకి వచ్చాకా మరోలా వ్యవహరించడం వల్ల ఈ రెండు సంఘటనల్లో గతంలో జగన్ ఆరోపణలు వాస్తవాలు కావన్న అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య విషయంలో విపక్షంలో ఉన్న సమయంలో అప్పటి అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు ఆయన హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం కాదు, వివేకా కుటుంబ సభ్యులే అనడంతో వైసీపీ, జగన్ ల మాటలలో విశ్వసనీయత కరవైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్ట మసకబారిందన్న భావన కలుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ జీవించి ఉన్న కాలంలో రామలక్ష్మణులకు ప్రతీకగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలను జనం చెప్పుకునే వారు.  అయితే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత నుంచీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.  వివేకానందరెడ్డి కాంగ్రెస్ లోనే ఉండటం, జగన్ వైసీపీ పార్టీ ప్రారంభించడం, ఆ తరువాత వివేకా వైసీపీలోకి వచ్చిన తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన స్వయంగా పరాజయం పాలు కావడంతో వివేకా, జగన్ మధ్య విభేదాలున్నాయా అన్న అనుమానాలు అప్పట్లోనే పొడసూపాయి. ఇక వైఎస్ వివేకా హత్య, తదననంతర పరిణామాలు  వైపీపీ ప్రతిష్ట మసకబార్చడమే కాకుండా, వైఎస్ ఫ్యామిలీ ప్రతిష్టను కూడా మసకబార్చాయంటున్నారు.  వైఎస్సార్ ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం వాటిల్లిందనీ చెబుతున్నారు.   కేసు దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ మరెన్ని విషయాలు బయటకు వస్తాయో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

Related Posts