YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫీవర్ సర్వే చేసిన వైద్యశాఖ

ఫీవర్ సర్వే చేసిన  వైద్యశాఖ

నెల్లూరు, మార్చి 14, 
దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడానికి సోమవారం నుంచి ఫీవర్‌ సర్వేను చేపట్టింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వో)కు ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు, గ్రామ, వార్డు వలంటీర్‌లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్‌ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది.శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమవుతున్న క్రమంలో వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, వైరల్‌ జ్వరాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్‌3ఎన్‌2 అనే వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇప్పటికే వెల్లడించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సైతం రాష్ట్రాలకు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది.  హెచ్‌3ఎన్‌2 ఫ్లూ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేయడం కోసం టెస్టింగ్‌ కిట్‌లను వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేస్తోంది. రెండు రోజుల్లో అన్ని బోధనాస్పత్రులకు వీటిని పంపనుంది. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో హెచ్‌3ఎన్‌2 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ జనవరిలో 12, ఫిబ్రవరిలో తొమ్మిది పాజిటివ్‌ కేసులను నిర్ధారించారు. అయితే ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.ఏటా సీజన్‌ మారుతున్న సమయంలో కేసులు కొంత పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్‌ మొదలవుతుండటంతో అవే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వస్తున్న బాధితులకు చాలా అరుదుగా మాత్రమే అడ్మిషన్‌ అవసరమవుతోందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే ఓపీల్లో 5 నుంచి 6 శాతం వరకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కేసులే ఉంటాయని గుర్తు చేస్తున్నారు.  
వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు..
► క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
► ఫ్లూ లక్షణాలున్నవారు మాస్క్‌ ధరించాలి.
► వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
► షేక్‌హ్యాండ్, ఆలింగనాలు మానుకోవాలి.
► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు.  

Related Posts