ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోరాట యాత్ర చేస్తున్న పవన్ భద్రతపై జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సరైన భద్రత లేదంటూ వారు ఏపీ డీజీపీ మాలకొండయ్యను కలిశారు. జనసేనాని యాత్ర, బస చేసే ప్రాంతాల్లో 30మంది పోలీసులతో సెక్యూరిటీని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో నేతలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం రక్షణగా ఉన్న పోలీసులు.. సివిల్ డ్రెస్‌తో ఉండటంతో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. వారు యూనిఫామ్‌లో ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిపై సానకూలంగా స్పందించిన డీజీపీ.. జిల్లా ఎస్పీలతో మాట్లాడి భద్రతపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని ఆ పార్టీ కోశాధికారి రాఘవయ్య తెలిపారు. రెండు రోజుల క్రితమే జనసేన నేతలు పవన్ యాత్రకు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. యాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారని.. వారిని అదుపు చేయడం ఇబ్బందిగా మారుతోందన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నా సరిపోవడం లేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా ఘటనలు జరిగే ప్రమాదం ఉందని.. ప్రభుత్వం వెంటనే స్పందించి రక్షణ కల్పించాలని కోరారు. దీనిలో భాగంగానే ఇవాళ డీజీపీని కలిసి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు నేతలు.