విజయవాడ, మార్చి 16,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం తరలి వెళ్తారని మూడున్నరేళ్లుగా చెబుతున్నా ఆచరణలో మాత్రం ఆ కోరిక తీరేలా కనిపించడం లేదు. 2019 డిసెంబర్‌లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాలను నెగ్గించుకుని వైజాగ్ ఎగిరిపోవాలనుకున్నారు. ముఖ్యమంత్రి ఆలోచన ఒకలా ఉన్నా పరిస్థితులు మాత్రం భిన్నంగా సాగాయి. అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఏ రద్దు బిల్లులు శాసన సభలో అమోదం పొందినా మండలిలో మాత్రం నెగ్గలేదు. ఈలోపు కోవిడ్ ముంచుకొచ్చింది. రెండేళ్లు కోవిడ్‌తోనే సరిపోయింది. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత పరిస్థితులు తనకు అనుకూలంగా మారుతాయని ముఖ్యమంత్రి భావించినా అలా జరగలేదు. కోర్టు కేసులు, ఆంక్షలు, ఆందోళనలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల అభివృద్ధికి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడమే మార్గమని జగన్మోహన్ రెడ్డి భావించారు. అమరావతి మీద పెట్టుబడులు పెట్టడం కంటే కాస్మోపాలిటిన్ నగరంగా ఉన్న విశాఖను రాజధాని చేస్తే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుందని భావించారు. ముఖ్యమంత్రి ఆలోచనను ప్రతిపక్షాలు వ్యతిరేకించినా, కోర్టుల్లో వివాదాలు తలెత్తిన సిఎం మాత్రం వెనకడుగు వేయలేదు. బిల్లులు నెగ్గకపోవడానికి మండలిలో బలం లేకపోవడమేనని భావించి ఏకంగా శాసన మండలిని రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎన్ని చేసినా సిఎం మాత్రం తన ఆలోచనల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.రాజధాని వికేంద్రీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, పర్యవసానాలు ఆలోచించని తీరు, కోర్టు వివాదాలతో తలెత్తే పరిస్థితుల్ని బేరీజు వేయకపోవడమే అడ్డంకులు ఎదురవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఆలోచనలకు అడ్డు చెప్పే వారు, వాటిలో సాధ్యాసాధ్యాలను వివరించే వారు ఆయన దగ్గర ఎవరు లేరనే విమర్శ ఉంది. ముఖ్యమంత్రికి ఎదురు చెప్పే సాహసం, సలహాలిచ్చే ధైర్యం నాయకుల్లోను, బ్యూరోక్రట్లలోను లేదనే విమర్శ ఉంది. ఈ కారణంగానే రాజధాని తరలింపు విషయంలో తరచూ బ్రేకులు పడుతున్నాయినిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించాలనుకుంటే దానికి పెద్దగా అడ్డంకులు ఎదురయ్యేవి కాదు. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పరిపాలనా వ్యవహారాలు సాగించే వెసులుబాటు ఉంది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే ముఖ్యమంత్రి కార్యాలయం అవుతుంది. అదే సమయంలో రాజధాని విషయంలో అన్ని వర్గాలను ఒప్పించడానికి బదులు ఏకపక్షంగా వ్యవహరించారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఖర్చుకు వెనుకాడి అమరావతి నిర్మాణాన్ని పక్కనపెట్టినా, ఆ విషయంలో ప్రభుత్వ వాదన, వివరణల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో విఫలమయ్యారు.వేలు, లక్షల కోట్ల రుపాయల వ్యయాన్ని అమరావతిపై చేయడం దండగని చెప్పడం తప్ప, విశాఖకు ఉన్న అనుకూలతల విషయంలో ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం అంతంత మాత్రంగానే చేశారు. హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పదేపదే సుప్రీం కోర్టు తలుపు తట్టడం ద్వారా విశాఖపట్నానికి తరలిపోవాలనే తొందరపాటుతనాన్ని ప్రజల ముందు బయటపెట్టుకున్నారు.విశాఖ గ్లోబల్ సమ్మిట్‌కు ముందు కూడా సుప్రీం కోర్టులో సానుకూల నిర్ణయం కోసం పదేపదే ప్రయత్నాలు చేశారు. అవి కూడా ఫలించలేదు. త్వరలో విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవహారాలను సాగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా అది ఎప్పటి నుంచి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మాదిరి గడువు మీద గడువు పెంచుకుంటూ పోవడం తప్ప ప్రస్తుతానికి ప్రభుత్వానికి చేయగలిగింది కూడా ఏమి లేని పరిస్థితి నెలకొంది.రాజధాని తరలింపు, అమరావతి నిర్మాణం మీద సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల పీటముడి వీడే వరకు ముఖ్యమంత్రి చేయగలిగేది కూడా ఏమి లేదనే భావన ఉంది. ఇప్పటికిప్పుడు సుప్రీం కోర్టులో వాదనలు పూర్తి చేసి, ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే లభించడంపై కూడా ప్రభుత్వానికి పూర్తి నమ్మకం లేదు. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న సమయంలో మరోసారి అసెంబ్లీలో బిల్లులు అమోదింప చేసుకుంటారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లుల్ని ఉభయసభల్లో అమోదింప చేసుకున్నా అవి కోర్టు తీర్పులకు లోబడతాయా అనే చర్చ కూడా ఉంది.