రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో పశువుల పెంపకందారులకు సరైన అవగాహన కల్పించి, పశు వైద్య అధికారుల సూచనలతో పశువులకు వైద్య సహాయం అందించేందుకు ‘పశుమిత్ర’లకు రాష్ట్రంలో అన్ని మండలాలలో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉత్పాదకతను పెంచి పశువుల పెంపకాన్ని లాభసాటిగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) మరియు పశు సంవర్ధక శాఖ సంయుక్తంగా ‘పశు మిత్ర’ పధకాన్ని ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 32 లక్షల కుటుంబాలు పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరికి క్షేత్ర స్థాయిలో గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ ద్వారా అందుతున్న సేవలను సమన్వయం చేస్తూ పశువులు ఎక్కువగా ఉన్న ప్రతి గ్రామ పంచాయితీలలో ఒక స్వయం సహాయక సంఘ మహిళను పశు మిత్రగా ఎంపిక చేశారు. ఇలా పశు మిత్రలుగా రాష్ట్రం మొత్తం మీద సుమారు 6640 మందిని నియమించారు. తేదీ 22-05-18 నుండి తేదీ 24-05-18 వరకు శిక్షణ పొందనున్న వీరు పశు సంవర్ధక శాఖ సిబ్బందికి, పశు పోషణపై ఆధార పడిన కుటుంబాలకు అనుసంధాన కర్తగా పనిచేస్తూ, పశుపోషణకు సరైన అవగాహన కల్పిస్తూ, సాంకేతిక సహాయం, మెళకువలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నూతన సాంకేతక పద్దతుల ద్వారా పశువుల పెంపకం చేపట్టడం ద్వారా నెలకు సుమారు రూ.10,000/- ఆదాయం సమకుర్చుకునే విధంగా సేవలను అందించనున్నారు. శిక్షణలో భాగంగా వీరికి పశువుల పెంపకంపై శిక్షణా దీపిక, సుమారు రూ.2000ల విలువ చేసే ప్రధమ చికిత్స కిట్ ను అందిస్తున్నారు. పశు వైద్య అధికారుల సూచనల మేరకు పశు మిత్రలు కోళ్ళకు టీకాలు వేయడం, గేదెలు, దూడలు, మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు మరియు టీకాలు వేయడం, పశు సంవర్ధక శాఖ అమలు చేస్తున్న పధకాలను స్వయం సహాయక సంఘ మహిళలకు తెలియజేసి తద్వారా వారికి లబ్ది చేకూర్చడం, తమ పంచాయితీ పరిధిలో పశుగ్రాస క్షేత్రాల సంఖ్యను పెంచడం ద్వారా పశు గ్రాస సాగును ప్రోత్సహించడం, ఆయా పంచాయితీల పరిధిలో పశువులకు సరిపడా గ్రాసాన్ని అందుబాటులో ఉంచడం వంటి విధులను నిర్వర్తించనున్నారు. నిర్దిష్ట సేవలను అందించడం ద్వారా, చేసిన పనికి అనుగుణంగా పశు మిత్రలు నెలకు రూ.3000లకు మించకుండా గౌరవ వేతనాన్ని పొందుతారు. అంతేకాక పశు సంవర్దక శాఖ ద్వారా సరఫరా చేసే పశువుల దాణా, పాతర గడ్డి( సైలేజ్) మరియు ఇతర సేవలకు ఐదు శాతం కమీషన్ వీరికి చెల్లిస్తారు.