ముంబై, మార్చి 16,
ఢిల్లీ నుంచి శ్రీ రామాయణ యాత్ర కోసం బయల్దేరే భారత్ గౌరవ్ ట్రైన్ ఏప్రిల్ 7 న ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. శ్రీరాముడు, రామాయణంతో సంబంధమున్న వివిధ పుణ్య క్షేత్రాలను 18 రోజుల పాటు చూపుతుంది.భారత్ గౌరవ్ ట్రైన్ ప్రత్యేకంగా టూరిజం అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రైలు. ఇది ఏసీ డీలక్స్ టూరిస్ట్ ట్రైన్. ఇందులో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తం 26 భారత్ గౌరవ్ రైళ్లను ప్రారంభించారు. ఈ ఎయిర్ కండిషన్డ్ రైలులో రెండు రెస్టారెంట్లు, మోడర్న్ కిచెన్, సెన్సర్ బేస్డ్ వాష్ రూమ్ ఫంక్షన్స్, కోచెస్ లో షోవర్ క్యూబికల్స్, ఫుట్ మసాజర్స్.. మొదలైన సౌకర్యాలుంటాయి. ఇందులో ఫస్ట్ ఏసీ, లేదా సెకండ్ ఏసీ లో ప్రయాణించవచ్చు.ఏప్రిల్ 7 న ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రైన్ శ్రీ రామాయణ యాత్ర కు బయల్దేరుతుంది. 18 రోజుల యాత్ర అనంతరం తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది. ఈ యాత్రలో భాగంగా మొదట అయోధ్య చేరుకుంటుంది. అక్కడ భక్తులు శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ ఆలయం, సరయు హారతి లను దర్శించవచ్చు. అక్కడి నుంచి సీ బిహార్ లోని సీతామర్హి కి వెళ్తారు. అక్కడ సీతాదేవి జన్మస్థలంగా భావించే ప్రాంతాన్ని, నేపాల్ లోని జానకిపూర్ లో ఉన్న రామజానకి ఆలయాన్ని రోడ్డు మార్గాన సందర్శిస్తారు. ఆ తరువాత వరుసగా బక్సర్ లోని రామ్ రేఖా ఘాట్, రామేశ్వరనాథ ఆలయం, గంగానదీ స్నానం మొదలైనవి ఉంటాయి. అక్కడి నుంచి వారణాసి, ప్రయాగరాజ్, చిత్రకూట్ లను సందర్శిస్తారు. అక్కడి నుంచి నాసిక్, హంపి, రామేశ్వరం మీదుగా భద్రాచలం చేరుకుంటారు. అక్కడి నుంచి చివరగా నాగపూర్ వెళ్తారు. అనంతరం తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. మొత్తంగా ఈ ప్రయాణంలో 7500 కిమీలు ప్రయాణిస్తారు.ఈ శ్రీ రామాయణ యాత్ర చేయాలనుకునేవారు సెకండ్ ఏసీలో ప్రయాణించాలనుకుంటే ఒక్కొక్కరు రూ. 1,14,065 చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏసీ క్లాస్ క్యాబిన్ కావాలనుకునేవారు ఒక్కొక్కరు రూ. 1,46,545, ఫస్ట్ ఏసీ కూపే కావాలనుకునేవారు ఒక్కొక్కరు రూ. 1,68,950 చెల్లించాల్సి ఉంటుంది. ట్రైన్ జర్నీతో పాటు ఏసీ హోటల్స్ లో వసతి, శాఖాహార భోజనం, ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్.. మొదలైన వసతులన్నీ ఈ ప్యాకేజీలోనే లభిస్తాయి.